బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. అతని మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్‌మీడియాలో నివాళులు అర్పించారు.
"అద్భుతమైన యువ నటుడు సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. వినోద ప్రపంచంలో ఆయన ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. మరిచిపోలేని చక్కని ప్రదర్శనలను మనకు విడిచి ఆయన వెళ్లిపోయారు. ఆయన చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి"
- నరేంద్రమోదీ, భారతదేశ ప్రధానమంత్రి
"ప్రతిభావంతుడైన నటుడు శ్రీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూసిన విషయం నన్ను కలచివేసింది. ఆయన వెండితెరపై మరపురాని అనేక పాత్రలకు ప్రాణం పోశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా మంది యువకులకు స్పూర్తిగా నిలిచారు. చాలా త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లారు. సుశాంత్ కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరుగాక".
- యం. వెంకయ్య నాయుడు, భారత ఉపరాష్ట్రపతి
"సుశాంత్ లేరన్న వార్త తెలిసి ఎంతో బాధపడ్డా. ప్రతిభ కలిగిన యువ నటుడైన సుశాంత్ తన నటన ఛరిష్మాతో వెండితెరపై మేజిక్ చేశారు."
-కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
"ఈ వార్త వినగానే నిజంగా నేను షాక్‌కు గురయ్యా. నాకు మాటలు రావడం లేదు. అతను నటించిన 'చిచ్చోరే' సినిమా చూశాను. సినిమాను ఎంత ఎంజాయ్ చేశానో ఆ చిత్ర నిర్మాత సాజిత్‌కు చెప్పాను. ఆ సినిమాలో నేనూ భాగమైతే ఎంతో బాగుండు అనుకున్నా. మంచి టాలెంట్ ఉన్న నటుడు సుశాంత్. ఈ విషాద ఘటనను తట్టుకునేలా వారి కుటుంబానికి దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా"
- అక్షయ్ కుమార్, కథానాయకుడు
"ఇది ఎంతో విషాదకర వార్త. బాలీవుడ్‌కు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా."
-అజయ్ దేవగణ్
"నా హృదయం ముక్కలైంది. నా నోటివెంట మాటలు రావడం లేదు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా" -సోనూసూద్
"నేను షాక్‌కు గురయ్యా.. ఇది నిజం కాదు"- దర్శకుడు అనురాగ్ కశ్యప్
"ఇది దిగ్భ్రాంతికర వార్త. అసలు ఏం జరుగుతోంది? వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" -విశాల్ దడ్లాని