సాగర తీరాన జీవిత సత్యాల్ని వెతుక్కుంటున్న బుట్టబొమ్మ ఒకరు.. వంద కేజీల బరువెత్తడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కొంటెపిల్ల మరొకరు. పల్లెటూరి సీతాకోక చిలుకల్లా కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న ముద్దుగుమ్మలు మరికొందరు. సామాజిక మాధ్యమాల వేదికగా కథానాయికలు చేస్తున్న అలర్లి నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే.. తాజాగా సముద్ర తీరంలో సేదతీరుతున్న ఓ చక్కటి చిత్రాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా సముద్రం చెబుతున్న పాఠాలు అంటూ తన ఫొటోకి ఓ ఆసక్తికర వ్యాఖ్య జతచేసింది. మనందరం ఎవరికి వారు ప్రత్యేకమైన గులకరాళ్ల లాంటి వాళ్లమే. కానీ, అందరం ఒకే సముద్రం నుంచి వచ్చాం అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది పూజా. ఈ చిత్రంలో ఆమె సముద్రపు ఒడ్డున రంగురంగుల గులకరాళ్లు ఏరుకుంటూ కనిపించింది. కన్నడ కస్తూరి రష్మిక 100కేజీల బరువెత్తడమే లక్ష్యంగా జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా జిమ్‌లో భారీ బరువులు ఎత్తుతున్న తన వీడియోను అభిమానులతో పంచుకుంది. నీకు సాధించాలని ఉంటే.. వెళ్లి అందుకో’ అంటూ ఆ వీడియోకి ఓ వ్యాఖ్యను జత చేసింది. ఆమె త్వరలోనే అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సెట్‌లోకి అడుగుపెట్టబోతుంది.