సీనియర్ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. జయప్రకాశ్‌రెడ్డి అకాల మరణం నాటక, చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు.
మరపురాని పాత్రలు పోషించారు: ప్రధాని మోదీ
"ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన సుదీర్ఘ సినీ యాత్రలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సహజ నటన.. రాయలసీమ యాస: వెంకయ్య
"సహజ నటన, రాయలసీమ యాసతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు, స్నేహశీలి జయప్రకాశ్ రెడ్డి పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లో తనదైన ముద్రవేసిన ఆయన మరణంతో సినీ పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఆయన స్థానం భర్తీ చేయలేనిది: అమిత్ షా
"గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు జయప్రకాశ్ రెడ్డి అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేనిలోటు తీర్చలేనిది, ఆ స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం."
- అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి
జయప్రకాశ్‌రెడ్డిది ప్రత్యేక స్థానం: జగన్
జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయప్రకాశ్‌రెడ్డి చలనచిత్రరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు.
రంగస్థలంలోనూ తనదైన పాత్ర: కేసీఆర్
జేపీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయింది: చంద్రబాబు
జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సంతాపం తెలిపారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. జయప్రకాశ్‌రెడ్డి నాటక, చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, తెలుగు నాటకరంగం పెద్ద దిక్కును కోల్పోయిందని పేర్కొన్నారు.
చిరంజీవి
సీనియర్ నటుడు శ్రీ జయ ప్రకాశ్ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాశ్ రెడ్డి గారితో నేను ఆఖరిగా చేసింది ఖైదీ నెంబర్ 150 సినిమాలో. ఆయన గొప్ప నటుడు. "నాటకరంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి" అనేవారు. అందుకే "ఇప్పటికీ శని, ఆదివారాల్లో షూటింగ్‌లు పెట్టుకోనండి, స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి" అని అనేవారు. ఆ అవకాశాన్ని పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్టు అంటే మొదట గుర్తుకొచ్చేది జయప్రకాశ్ రెడ్డిగారే. తనకంటూ ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకురాలి. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
బాలకృష్ణ: ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా.
పరుచూరి గోపాలకృష్ణ: వెండి తెరమీద వెలుగుతూ కూడా రంగస్థలాన్ని మరువని నటుడు, రాయలసీమ యాసకు ప్రాణం పోసిన మా జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశాడన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా.
వెంకటేశ్: నా స్నేహితుడు జయప్రకాశ్ రెడ్డి ఆకస్మిక మరణం నన్ను కలచివేసింది. ఆయనతో కాంబినేషన్ తెరపై చాలా గొప్పగా ఉండేది. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.
మోహన్‌బాబు: జయప్రకాశ్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాశ్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ.. పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పది మందికి సహాయం చేయాలనే వ్యక్తి. జయప్రకాశ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
రాజేంద్ర ప్రసాద్:మేమంతా ప్రేమగా జేపీ అని పిలుచుకునే జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మాకు దూరం కావడం దారుణమైన వార్త. స్టేజ్ నుంచి సినిమాకు వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. రాయలసీమ ట్రెండ్‌తో భయంకరమైన విలన్ నుంచి పూర్తి కామెడియన్‌గా రాణించారు. మొన్న 'సరిలేని నీకెవ్వరు' సినిమాలోనూ 'కూజాలు చెంబులైపోతాయి..' అంటూ తనకంటూ మార్క్ ఏర్పరచుకున్నారు. నన్ను ప్రసాదూ.. అనేవారు. ఆయన మరణం అభిమానుల్ని కూడా చాలా బాధిస్తోందని తెలుసు. కానీ జీవితంలో కొన్నింటిని అంగీకరించక తప్పదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మహేశ్‌బాబు: జయప్రకాశ్ రెడ్డి గారి మరణం నన్ను ఆవేదనకు గురి చేసింది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప నటుడు, కమెడియన్. ఆయనతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా.
ఎన్టీఆర్: అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాశ్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
ప్రకాశ్‌రాజ్:సహ నటుడు జయప్రకాశ్ రెడ్డి గారి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపై, ఇటు స్టేజ్ నాటకాల్లో పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు ఆయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు సర్.
రవితేజ:జయప్రకాశ్ రెడ్డి గారి గురించి తెలిసిన తర్వాత చాలా బాధపడ్డా. ఆయన్ను నేను సరదాగా మామ అనేవాడ్ని. ఆయన మృతి తీరని లోటు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి మామ.
సుధీర్‌బాబు: భయంకరమైన వార్తతో నిద్రలేచా. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
అనిల్ రావిపూడి: జేపీ గారితో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. నేను తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఆయన నన్ను తన సొంత మనిషిలా చూసుకునేవారు, ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయన్ను నేను చాలా మిస్ అవుతున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్. ఓ నటుడిగా, వ్యక్తిగా.. మీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు.
తమన్: జయప్రకాశ్ రెడ్డి గారి మృతి ఎంతో బాధిస్తోంది. దీన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి.
బండ్ల గణేశ్:జయప్రకాశ్ రెడ్డి గారి మరణం నన్నెంతో బాధించింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం సర్.