ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న కరోనా వైరస్(కొవిడ్-19) చలనచిత్ర పరిశ్రమనూ కుదిపేస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్‌లు, మరికొన్ని చిత్రాల ప్రచార కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రముఖ సెలబ్రిటీలంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఈ వైరస్ సెగ అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ 'కేన్స్'కు తగిలింది. సాధారణంగా మే 12 నుంచి 23 వరకు జరగాల్సిన ఈ వేడుక జూన్ లేదా జులై నెలకు వాయిదా వేశారు ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు. ప్రస్తుత పరిస్థితి కుదుటపడ్డాక కొత్త తేదీపై స్పష్టత ఇస్తామని తెలిపారు. దీనిపై ఉన్నాతాధికారులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
"ఫ్రాన్స్‌తో పాటు అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి కుదుటపడ్డాక ఈ వేడుక ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఈ విషయమై ఫ్రెంచ్ ప్రభుత్వం, చిత్రపరిశ్రమ ప్రముఖులు, ఇతర అధికారులతో చర్చలు జరుపుతున్నాం."