తెలంగాణ

telangana

హాస్య'బ్రహ్మా'.. నీ నవ్వుకు సలామ్

By

Published : Feb 1, 2021, 5:32 AM IST

ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయించిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 1). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని విశేషాల గురించి ప్రత్యేక కథనం.

Brahmanandam birthday special story
హాస్యబ్రహ్మా.. నీ నవ్వుకు సలామ్

ఖాన్​తో గేమ్స్‌ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయి!

నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రావుగారూ!

ఇరుకుపాలెంవాళ్లంటే ఎకసెకాలుగా ఉందా?

దొరికాడా.. ఏసెయ్యండి ..!

నీ యంకమ్మా..!

రకరకాలుగా ఉంది మాస్టారూ..!

నా పర్​ఫార్మెన్స్‌ నచ్చితే ఎస్‌ ఎం ఎస్‌ చేయండి..!

బ్రహ్మానందం

ఏ నాలుగు రోడ్ల కూడలిలో ఏ నలుగురు ముచ్చట్లాడుకున్నా.. మధ్యలో దూరిపోయి సరదా సందడి చేసే సంభాషణలు అవి. రొటీన్‌ మొనాటనీని ఛేదిస్తూ.. ఎంచక్కా హాయిగా నవ్వుకునే వీలు కల్పించే హాస్య ఔషధం అది. సినిమా ప్రభావం ఇంతుందా? అనిపించే విధంగా జనజీవనంలో కలిసిపోయి.. జనం నాలుకలపై నిత్యం నర్తించే ఈ తరహా మాటలు నెమ్మది నెమ్మదిగా ఊత పదాల్లా మారిపోయాయంటే అతిశయోక్తి కానేకాదేమో? ఈ సరదా సంభాషణలు గుర్తుకు రాగానే.. కళ్ల ముందు మెరుపులా ఓ రూపం కదలాడి తీరుతుంది. ఆ ముఖం కనిపించగానే.. అసంకల్పితంగా పెదాలపై చిరునవ్వులు విరిసి, తలచుకున్నా బ్రహ్మానందమే అనిపిస్తుంది. ఔను.. బ్రహ్మానందం పేరు విన్నా.. రూపు కన్నా.. వివిధ చిత్రాల్లో ఆయన పరకాయ ప్రవేశం చేసిన పాత్రలు గుర్తు తెచ్చుకున్నా గుండెల నిండుగా నవ్వులే నవ్వులు.

'నవ్వడం ఒక యోగం.. నవ్వించడం భోగం.. నవ్వకపోవడం రోగం..' అంటూ హాస్య బ్రహ్మ జంధ్యాల ఏ ముహూర్తాన అరగుండు బ్రహ్మానందాన్ని తెర పరిచయం చేశారో? అప్పట్నుంచి తెలుగు డిక్షనరీలో నవ్వుకు పర్యాయ పదం బ్రహ్మానందం అయింది. హాస్యం పండించడం కాదు.. తెరపై కనిపిస్తేనే ప్రేక్షకుల్లో నవ్వులు తెప్పించే స్థాయికి బ్రహ్మానందం చేరుకున్నారు. ఆయన ఇప్పుడు కొత్తగా నటించక్కర్లేదు. హాస్య రసస్ఫూర్తిగా చిరకీర్తిని ఆర్జించేసారు. నట విదూషకుడిగా తెలుగు సినీ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. నవ్వే జనా సుఖినోభవంతూ.. అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. దటీజ్‌ బ్రహ్మానందం.. కన్నెగంటి బ్రహ్మానందం.

ఆయన చాగంటివారిపాలెం కన్నెగంటి

మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే అంటూ తన వృత్తిపైనా సరదా సెటైర్లు వేసుకునే బ్రహ్మానందం పుట్టింది 1956 ఫిబ్రవరి 1న. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా చాగంటివారి పాలెం ఆయన స్వగ్రామం. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి. తల్లి కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. బ్రహ్మానందం అనే పేరు పెట్టినా.. బాల్యంలో ఏ చిన్ని ఆనందానికి ఆయన నోచుకోలేదు. కారణం.. బ్రహ్మానందం పుట్టిన తరువాత ఆయన తల్లి లక్ష్మీనరసమ్మ గుర్రపువాతం జబ్బుకు లోనయిందట.

ప్రసవ సమయంలోనే ఆమె బతుకుతుందో.. లేదోనని కుటుంబ సభ్యులంతా కలవరపడ్డారట. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినా.. తీవ్ర స్థాయిలో జబ్బుకు లోనవడం వల్ల బ్రహ్మానందం ఆలనా పాలన చూసుకునేవారు కరవయ్యారు. ఆ కారణంగానే అన్ని విషయాల్లో చిన్నచూపునకు గురయ్యారు. అలాంటి బాల్యం గడిపిన బ్రహ్మానందం.. కళాకారుడిగా తన పేరును సార్ధకం చేసుకున్నారు. గుండెలో ఎన్ని బాధలున్నా పైకి గంభీరంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. అంతేకాదు తన చుట్టూ ఉన్నవారికి ఆనందం పంచడంలోనే మాధుర్యాన్ని అందుకున్నారు. అందుకే ఓ హాస్య నటుడిగా తనదైన ముద్రను వేసుకోగలిగారు.

సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్‌లో చదివిన బ్రహ్మానందం.. భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజ్‌లో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎమ్​.ఏ పట్టా పొందారు. ఆ తరువాత అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్‌గా పని చేసి, ఆ తర్వాత వెండితెర అరంగేట్రం చేశారు. బ్రహ్మానందం తండ్రి రంగస్థల నటుడే. ఆయన నుంచి వారసత్వంగా కళల పట్ల ఆసక్తి తనలో పెరిగిందని బ్రహ్మానందం తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. స్వర అనుకరణలో నిపుణత సాధించిన ఆయన.. కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వారిని అనుకరిస్తూ వినోదం పంచేవారు. అదే వినోదాన్ని 1985లో దూరదర్శన్‌లో పకపకలు అనే కార్యక్రమం ద్వారా బయట ప్రపంచానికి పంచారు.

పుట్టిన రోజునే తొలి వేషం

బ్రహ్మానందం తన పుట్టిన రోజునే తొలి వేషాన్ని వేసి జన్మలో తానూ మరిచిపోలేని కానుకను అందుకున్నారు. నరేష్‌ హీరోగా నటించిన 'శ్రీ తాతావతారం' చిత్రంలో హీరో నలుగురి స్నేహితుల్లో ఒకరిగా 1985 ఫిబ్రవరి ఒకటిన హైదరాబాద్‌ వెస్లీ కాలేజ్‌లో బ్రహ్మానందంపై తొలి షాట్‌ను ఆ చిత్ర దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ తీశారు. ఆ ముహూర్తంతో తెలుగు సినీ సీమకు బ్రహ్మానందం అనే హాస్య కళాకారుడు దొరికాడు.

వేజెళ్ళ సత్యనారాయణ సినిమా ద్వారా బ్రహ్మానందం పరిచయమైనా, జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్ళంటా!' తొలిసారి విడుదలైంది. ఆ చిత్రంలో బ్రహ్మానందం అరగుండు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. పిసినారి యజమాని దగ్గర పనిచేస్తూ నవ్వులు పండించే పాత్ర అది. అందులోని బ్రహ్మానందం మాటలు ఇప్పటికీ ప్రేక్షకులు తలచుకుని తలచుకుని మురిసిపోతుంటారు. పాడె మీద పైసలేరుకునే వెధవా.. పోతావురా .. రేయ్‌.. నాశనమై పోతావ్‌! లాంటి నవ్వు తెప్పించే సంభాషణలు.. బ్రహ్మానందం వాటిని పలికే తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత బ్రహ్మానందం మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సంవత్సరాల తరబడి వన్నె తగ్గని హాస్యాన్ని పండిస్తూ విజయవంతంగా నటయాత్ర సాగించారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని చిత్రసీమలో తనదైన ఖ్యాతినార్జించారు.

వెయ్యికి పైగా చిత్రాలు.. గిన్నీస్‌ బుక్‌ రికార్డు

బ్రహ్మానందం.. చకచకా చిత్రాలు చేసుకుంటూ.. అనతి కాలంలోనే వెయ్యికి పైగా పూర్తి చేసి 2010లోనే గిన్నీస్‌ బుక్‌లో తనపేరు నమోదు చేసుకున్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అందుకున్న అవార్డులు, పురస్కారాలకు లెక్కే లేదు. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, ఆరు సినిమా అవార్డులు, ఒక ఫిలిం ఫేర్‌ అవార్డు, మూడు సైమా పురస్కారాలు స్వీకరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి 2005లో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. అయిదు కళాసాగర్‌ అవార్డులు, తొమ్మిది వంశీ బర్కిలీ అవార్డులు, పది సినీ గోయర్స్‌ అవార్డులు, ఎనిమిది భరతముని పురస్కారాలు, రాజీవ్‌ గాంధీ సద్భావనా పురస్కారం, ఆటా, సింగపూర్, అరబ్‌ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్‌ పురస్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి గౌరవ సన్మానాలు అందుకున్నారు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరంతో సత్కరించారు. సత్తెనపల్లి సంస్థ స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించారు.

విఖ్యాత హాస్య నటులయిన రేలంగి, రాజబాబు, చలం, అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు.. పేరిట పురస్కారాలు బ్రహ్మానందాన్ని వరించి వచ్చాయి. 2018 మర్చి 18న టీఎస్సార్‌ కాకతీయ కళా పరిషద్‌ నుంచి హాస్య నట బ్రహ్మ బిరుదును అందుకున్నారు. ఆ మధ్య తీవ్ర అస్వస్థతకు లోనయిన బ్రహ్మానందం ముంబయ్‌ లీలావతి హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్నారు. ఈ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలో ''..రాములో రాములా..'' పాటలో కనిపించి అల్లరి చేశారు.

ఇదీ చూడండి:'కొండవీటి రాజా' చిత్రానికి 35 ఏళ్లు!

ABOUT THE AUTHOR

...view details