లాక్‌డౌన్‌తో మూగబోయిన చిత్రసీమ చాలా రోజులు తర్వాత సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. వందశాతం ఆక్యుపెన్సీకి కేంద్రం అనుమతులు ఇవ్వడం వల్ల పలు చిత్రాలు వరుసగా విడుదలయ్యేందుకు క్యూ కట్టి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఒకదానితో మరొకటి పోటీపడుతూ థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలైతే ఏకంగా ఒకే రోజు సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ హీరో సినిమా ఎవరితో పోటీ పడనుందో ఓ సారి లుక్కేద్దాం.
ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' ఈ ఏడాది ఈద్‌కు థియేటర్లలోకి రానుండగా.. మరోవైపు మిలాప్ జవేరీ డైరెక్షన్లో జాన్ అబ్రహాం నటించిన 'సత్యమేవ జయతే 2' మే 12న రిలీజ్ కానుంది.
అక్షయ్ కుమార్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ 'బెల్ బాటమ్' ఏకంగా హాలీవుడ్ సినిమా 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9'తో పోటీ పడనుంది. ఈ రెండు చిత్రాలు మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
విష్ణు వర్థన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'షేర్షా' జులై 2న విడుదలవుతుండగా.. అదే రోజున 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్' విడుదల కానుంది. ఇందులో అడవి శేష్ నటించారు.