తెలంగాణ

telangana

ETV Bharat / sitara

92 ఏళ్ల ఆస్కార్​ చరిత్రలో ఇదే తొలిసారి!​ - telugu cinema news

అమెరికా లాస్​ ఏంజిలెస్​ వేదికగా జరిగిన ఆస్కార్​ అవార్డు వేడుకలో ఉత్తమ చిత్రంగా స్థానం దక్కించుకుంది 'పారాసైట్'​. సినీ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆస్కార్​ చరిత్రలోనే ఉత్తమ చిత్రంగా నిలిచిన తొలి విదేశీ సినిమాగా రికార్డు సృష్టించింది. బాంగ్​ జూన్​ హో ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

Bong Joon Ho creates Oscar history with best picture win for 'Parasite'
ఆస్కార్:​ చరిత్రలోనే తొలి విదేశీ ఉత్తమ చిత్రంగా పారాసైట్​

By

Published : Feb 10, 2020, 12:30 PM IST

Updated : Feb 29, 2020, 8:39 PM IST

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు 'ఆస్కార్‌' ప్రదానోత్సవం లాస్‌ ఏంజిలెస్​లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఎందరో అతిరథ మహారథుల సమక్షంలో విజేతలు అకాడమీ అవార్డులను అందుకొన్నారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రం ఫలితం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సినీ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ 'పారాసైట్‌' ఉత్తమ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆస్కార్‌ చరిత్రలో ఓ విదేశీ సినిమా ఉత్తమ చిత్రంగా నిలవడం ఇదే తొలిసారి. ఈ మూవీకి బాంగ్​ జూన్​ హో దర్శకత్వం వహించాడు.

ఆస్కార్​ అవార్డు బరిలో దిగిన ఈ సినిమా.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఒరిజినల్​ స్క్రీన్​ ప్లే విభాగాల్లోనూ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాంగ్​ జూన్ హూ మనసులో మాటలు పంచుకున్నాడు.

"వయసులో ఉన్నప్పుడు నేను సినిమా గురించి చదువుతున్న రోజుల్లో నా మనసులో నిలిచిపోయిన ఓ మాట ఉంది. 'మనం ఏదైతే వ్యక్తిగతంగా భావిస్తామో అందులో సృజనాత్మకత ఉంటుంది.' పాఠశాలలో ఉన్నప్పుడు ఎక్కువగా మార్టిన్​ స్కోర్సెన్​ చిత్రాలను చూసేవాడిని. ఈ అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదు."

బాంగ్ జూన్​ హొ, పారాసైట్​ చిత్ర దర్శకుడు

ఓ వైపు ఉత్తమ చిత్రంగా 'పారాసైట్' నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచగా.. బ్రిటన్​ దర్శకుడు సామ్​ మెండిస్​ తెరకెక్కించిన '1917' చిత్రానికి పురస్కారం రాకపోవడం అభిమానులకు నిరాశ మిగిల్చింది. కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లోనూ అవార్డు పొందిన తొలి దక్షిణ కొరియా సినిమాగా 'పారాసైట్'​ చరిత్రలో నిలిచింది.

పాశ్చాత్య ప్రేక్షకులకు బాంగ్​ చిత్రాలు కొత్తేం కాదు. గతంలో 'మెమొరీస్​ ఆఫ్​ మర్డర్'​ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణ కొరియా సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.

కథేంటంటే...

ఓ పేద కుటుంబంలోని నలుగురు వ్యక్తులు.. కడుపు నింపుకోవడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో.. ఉద్యోగాల కోసం ఓ ధనిక కుటుంబం పంచన చేరుతారు. తామంతా ఒకే కుటుంబం అన్న విషయాన్ని యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాలు చేస్తున్న వారిని మోసపూరితంగా ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహార యాత్రకు వెళ్లినప్పుడు ఆ ఇంటిలోని సౌకర్యాలను అనుభవిస్తూ దర్జాగా గడిపేస్తుంటారు. అయితే తమ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి వీరంతా ఒకే కుటుంబం అన్న విషయం తెలిసిపోతుంది.

ఆలోపు యజమాని కుటుంబం తిరిగి వచ్చేస్తోందన్న సమాచారం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తమ బండారం బయటపడితే ఉద్యోగాలు పోతాయన్న భయంతో వాళ్లేం చేశారు? అనే విషయాలతో పారాసైట్​ చిత్రం తెరకెక్కింది. పేద, ధనిక వర్గాల అంతరాల వల్ల సమాజంలో నెలకొన్న కఠిన పరిస్థితులకు వినోదాన్ని జోడించి దర్శకుడు బాంగ్‌ జూన్‌ హూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని టెలివిజన్​ సిరీస్​ రూపంలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Feb 29, 2020, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details