దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజ్ డేట్ వివాదానికి తెరలేపింది. 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల తేదీ పట్ల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా తాను నిర్మించిన 'మైదాన్' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఆరు నెలల ముందే ప్రకటించినప్పటికీ అదే నెలలో 13న 'ఆర్‌ఆర్‌ఆర్'ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోనీకపూర్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల గురించి స్పందించారు.
"నిజం చెప్పాలంటే రాజమౌళి సినిమా విడుదల పట్ల నేనెంతో అసంతృప్తిగా ఉన్నాను. ఇది అన్యాయం. 'మైదాన్' విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితమే ప్రకటించాను. అందరం ఒక్కటిగా ఉండి చిత్ర పరిశ్రమను కాపాడాల్సిన ఈ సమయంలో 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ఇలా చేయడం నాకు నచ్చలేదు."