"నా సినిమా సినిమాకు గ్యాప్ వస్తుందని, వెనకబడి పోతున్నానని నేనెప్పుడూ టెన్షన్ పడను. నేను తీసే సినిమాతో ప్రేక్షకులకు ఎంత మంచి విషయం చెబుతున్నానన్నదే నాకు ముఖ్యం" అని అన్నారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఇప్పుడాయన డైరెక్షన్లో అఖిల్ హీరోగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు భాస్కర్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
"ప్రతి పెళ్లి వేడుకలా జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఎలా బతకాలి అన్న విషయంలో ఎవరికీ స్పష్టత ఉండదు. అసలు వివాహం తర్వాత కాపురం సాఫీగా సాగడానికి కావాల్సిన అర్హతలేంటి? అన్నది మనకు తెలియదు. ఈ అంశాన్ని ఓ ఆసక్తికర కథనంగా చెప్పాలి.. అదీ సున్నితమైన వినోదంతో ఆకట్టుకునేలా చూపించాలి అన్న ఉద్దేశంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చేశాం. మనలో ఉన్న ఓ ఎమోషన్‌ను మనసులో ఉన్న ఓ వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు.. ఆ టైమ్‌కు వాళ్లు రాకపోతే కలిగే బాధని వర్ణించలేము. ఆ బాధ ఎలా ఉంటుందనేది దీంట్లో ఆసక్తికరంగా చూపించాం. దీనికి అఖిల్, పూజా హెగ్డే తమదైన నటనతో ప్రాణం పోశారు".