అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కొత్త సీజన్ ప్రోమోను లాక్‌డౌన్ సమయంలోనే చిత్రీకరించారు. దర్శకుడు నితేష్ తివారి నుంచి ఫోన్‌లో సూచనలు తీసుకుని అమితాబ్ తన ఇంట్లోనే ఆ ప్రోమోను స్వయంగా చిత్రీకరించారు. ఆ ప్రోమోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. లాక్‌డౌన్‌లోనే కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన ఫాంహౌస్‌లో 'తేరే బినా..' అనే మ్యూజిక్ వీడియో చిత్రీకరణను పూర్తి చేశారు. అందులో సల్మాన్‌తో పాటు కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. ఆమె లాక్‌డౌన్ మొదలైనప్పట్నుంచి సల్మాన్ ఫాంహౌస్‌లోనే గడుపుతోంది. ఈ పాటను సల్మాన్ స్వయంగా ఆలపించి, దర్శకత్వమూ వహించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది.
బాలీవుడ్ స్టార్స్.. వర్క్ ఫ్రమ్ హోమ్ - కౌన్ బనేగా కరోడ్‌పతి కొత్త ప్రోమో
కసరత్తులు చేస్తున్న వీడియోలతో వహ్వా అనిపించారు. వంట గదిలో గరిటె తిప్పి నోరూరించారు. ఆన్‌లైన్ ఛాలెంజ్‌లతో ఉత్సాహపరిచారు. లాక్‌డౌన్ విరామంలో తారలు చేసిన ఈ సందడి అభిమానులను ఎంతో అలరించింది. అయితే ఇప్పుడు కొందరు నటులు వర్క్ ఫ్రం హోమ్ తరహాలో ఇంటి నుంచే తమ ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై దృష్టిపెట్టారు. అందులో భాగంగా ఇంటి గడప దాటకుండానే చిత్రీకరణలు పూర్తి చేస్తుండటం విశేషం.
కథానాయకుడు వరుణ్ ధావన్ లాక్‌డౌన్‌లోనే ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. వీడియో కాల్ ద్వారా దర్శకుడు, సాంకేతిక నిపుణుల సూచనలను తీసుకుంటూ తన ఇంట్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు వరుణ్. దర్శకద్వయం రాజ్ నిడిమోరు, డీకే కృష్ణ ఇళ్లు కదలకుండానే 'ఏ వైరల్ వెడ్డింగ్: మేడిన్ లాక్‌డౌన్' అనే వెబ్ సిరీస్‌ను పూర్తి చేశారు. అందులో నటులంతా తమ ఇళ్లలో నుంచే నటిస్తూ తమ కెమెరాలతోనే చిత్రీకరణ పూర్తి చేయడం గమనార్హం.
ఇదీ చూడండి.. బాలకృష్ణతో బరిలో దిగే మరో విలన్ ఎవరు?