మరోసారి విభిన్న పాత్రలో బిగ్ బీ..! - కోపిష్ఠి ఇంటి యజమాని పాత్రలో అమితాబ్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు విలక్షణ నటుడిగా మంచి పేరుంది. వయసుతో సంబంధం లేకుండా వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఓ చిత్రంలో 102 ఏళ్ల వృద్ధుడిగా దర్శనమిస్తే.. మరో చిత్రంలో మానసికంగా ఎదగని కుర్రాడిగా కనిపించి మురిపిస్తారు. ఇప్పుడీ సీనియర్ హీరో ఓ కోపిష్ఠి ఇంటి యజమాని పాత్రతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏడు పదుల వయసు పైబడినా యువ కథానాయకులకు పోటీ ఇస్తూ వైవిధ్య పాత్రలతో దూసుకుపోతున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం సూజిత్ సర్కార్ దర్శకత్వంలో 'గులాబో సితాబో' అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన లుక్‌కు సంబంధించిన ఫొటోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బిగ్ బచ్చన్ భారీగా పెరిగిన గడ్డంతో వృద్ధుడి రూపంలో కనిపిస్తున్నారు. కుటుంబ కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా 'చెహరే' అనే సినిమాలో తన చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు అమితాబ్. తెలుగులోనూ 'సైరా' చిత్రంలో ఓ పాత్ర పోషించారు అమితాబ్.