రవాణా సదుపాయాల్లో భాగంగా క్యాబ్‌లు ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు తప్పట్లేదు. డ్రైవర్ల అనుచిత, అసభ్య ప్రవర్తనలపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు రాగా.. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఈ జాబితాలో చేరింది. అందుకే క్యాబ్ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే.. ప్రజా రవాణా శ్రేయస్కరమని సూచించింది.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ "లండన్‌లో ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నపుడు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణాను ఉపయోగించడం మేలు. నేనైతే వణికిపోయా"
- సోనమ్ కపూర్, సినీ నటి.
డ్రైవర్ తనపై విపరీతంగా అరిచాడని.. ఫలితంగా మధ్యలోనే తాను క్యాబ్ దిగిపోవాల్సి వచ్చిందని చెప్పింది సోనమ్. ఈ అమ్మడు ట్వీట్‌కు ఉబర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ నటి ట్వీట్‌కు అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. గతంలో ఉబర్ సేవలను లండన్‌లో నిషేధించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
కొత్త ఫీచర్‌తో చెక్ పడేనా...!
క్యాబ్ డ్రైవర్లపై ఫిర్యాదులతో విసిగిపోయిన ఉబర్ సంస్థ.. తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. 'వాయిస్ ఆడియో రికార్డింగ్' ఫీచర్ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.