బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా... కెరీర్ ఆరంభంలో చాలా బరువుండేది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్ల చాలా కసరత్తులు చేసి దాదాపు 30 కిలోలకు పైగా తగ్గింది. అయితే ఇప్పటికీ ఆమె ఆకారంపై సోషల్‌మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తుంటే... మరికొందరు దారుణంగా తిడుతున్నారట. తాజాగా ఈ అమ్మడు తన రూపురేఖల గురించి హేళనగా మాట్లాడిన నెటిజన్ల నోర్లు మూయించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 'బిగ్గర్ దెన్ దెమ్' పేరుతో ఓ వీడియోను షేర్ చేసింది.
సోనాక్షి... అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా స్ఫూర్తి నింపేలా...
ఈ వీడియోలో ఐదేళ్లుగా నాకు ఎదురైన పరిస్థితిలో మార్పు రాలేదని చెప్పిన ఆమె... 'ఆవు క్యాట్‌వాక్ చేస్తోంది.. ఆంటీ జీ.. ఏనుగు.. ఫాట్‌సో' ఇలా నెటిజన్లు తనను విమర్శించిన పదాలతో వీడియోను విడుదల చేసింది.
" సోషల్‌మీడియాలో ఇలా పిలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఓసారి ఊహించండి. మీకు అనిపించిన దాన్ని ఇక్కడ పోస్ట్ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నారా?.. వీటినే ట్రోల్స్ అంటుంటారు కదా. ఎలాంటి పని ఉండదు కాబట్టి వీరికి ఇతరుల్ని జడ్జ్ చేసేందుకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఎలాగైనా, ఏమైనా మాట్లాడతారు.. మేం వినాలి. కొన్నిసార్లు మాకు కోపం వస్తుంది. కొన్నిసార్లు బాధపడుతుంటాం. కానీ ఇప్పుడు నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు జోకర్లతో సమానం. నేను చాలా విన్నా. బాధపడ్డా. 30 కిలోల బరువు తగ్గినప్పటికీ నా గురించి అలానే మాట్లాడుతున్నారు. అందుకే వారిని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా"
-- సోనాక్షి సిన్హా, బాలీవుడ్ నటి
తన బరువు, ఆకారం.. దాచుకోవాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చిన సోనాక్షి... 'నేనేమి స్కేల్‌పైన ఉండే నెంబర్‌ను కాదు' అని ఘాటుగా సమాధానమిచ్చింది.
ప్రస్తుతం 'దబాంగ్ 3'లో నటిస్తోంది సోనాక్షి. కండలవీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా... డిసెంబరు 20న విడుదల కాబోతోంది. వీటితో పాటు అజయ్ దేవగణ్, సంజయ్‌దత్‌లతో కలిసి 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో సుందర్‌బెన్ జీతాగా కనువిందు చేయనుంది.