తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ధైర్యం చెప్పాడు.. అంతలోనే తనువు చాలించాడు! - Bollywood Actor sushant singh rajput death after chhichhore movie scenes trending in news

బుల్లితెరపై తొలి అడుగు వేసిన ఓ నటుడు.. అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కి ఎంతో పేరు సంపాదించాడు. అయితే ఆ విజయాన్ని మరిన్ని రోజులు ఆస్వాదించకుండానే బలవంతంగా తనువు చాలించాడు. ఒకప్పుడు బలన్మరణం తప్పు, ఓడిపోతే జీవితం అయిపోయినట్లు కాదు అని చెప్పిన అతడే.. ఆ మాటలను మరిచి తన ప్రస్థానానికి ముగింపు పలికాడు.

Sushant singh rajput
సుశాంత్​ సింగ్​​: బాగా చదివాడు.. జీవితంలో ఫెయిలయ్యాడు

By

Published : Jun 14, 2020, 4:32 PM IST

Updated : Jun 14, 2020, 7:35 PM IST

జీవితం.. ఓ వింత నాటకం అనడానికి సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కెరీర్​ను​ ఓ నిదర్శనంగా చెప్పొచ్చు. ఫిజిక్స్​లో నేషనల్​ ఒలింపియాడ్ సాధించిన​ యువకుడు.. ఇంజినీరింగ్​లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత బ్యాక్​లాగ్​లు ఉండిపోయి అయిష్టంతో మూడేళ్లలోనే ఆ కోర్సును విడిచిపెట్టాడు. ఆ తర్వాత కెరీర్​ మార్చుకుని 2008లో ఓ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టాడు. అనంతరం 'ఎం.ఎస్​ ధోనీ', 'చిచ్చొరే' వంటి సినిమాలతో ఎందరినో తన మనసుకు దగ్గర చేసుకున్నాడు. అయితే ఈ సారి ఆ వృత్తినీ మధ్యలోనే వదిలిపెట్టాడు. కెరీర్​ మంచి జోరు మీదున్న సమయంలో అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అందుకే అతడి మృతి తన సినిమానే గుర్తు చేస్తోంది.

ఆ సినిమాలో ఇలా...

గతేడాది సెప్టెంబర్​ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'చిచ్చోరే'. కళాశాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధా కపూర్‌ అద్భుతంగా నటించారు. ఇందులో అనిరుధ్‌(సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌), మాయ(శ్రద్ధా కపూర్‌) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా.. కొన్నాళ్లకు విడిపోతారు. వారికి రాఘవ్‌ అనే ఓ టీనేజీ కుమారుడు ఉంటాడు. పేరొందిన ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు దక్కకపోవడం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకుంటాడు. దీంతో తల్లిదండ్రులైన సుశాంత్​, శ్రద్ధ అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఐదుగురు స్నేహితులు ఆస్పత్రికి వచ్చి రాఘవ్‌ను పరామర్శిస్తారు. అతడిలో ధైర్యం నింపడానికి వారంతా కళాశాలలో చదువుకున్న సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఎదురైన అనుభవాలను రాఘవ్‌కు వివరిస్తారు.

ఎలా తీశాడో అలానే...

ఈ మధ్య కాలంలో విద్యార్థుల్లో చదువు ఒత్తిడి ఓ మానసిక వ్యాధిలా మారింది. పరీక్షలకు భయపడి.. ఆశించిన ఫలితాలు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అంశాన్నే ఎంచుకుని విద్యార్థి దశలో జయాపజయాలు సహజమేనని చెప్పాడు సుశాంత్​. ఆ సినిమాలో ఏ సందేశం అయితే ఇచ్చాడో అదే పాటించకుండా అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్.

ఇవీ విజయాలు..

  • నేషనల్​ ఒలింపియాడ్​ విజేత(ఫిజిక్స్​లో)
  • దిల్లీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో ఆల్​ఇండియా 7వ ర్యాంక్​ (2003లో)
  • బ్యాచిలర్​ ఆఫ్​ ఇంజినీరింగ్​(పూర్తి చేయలేదు)
  • కై పో చెయ్( బెస్ట్​ మేల్​ డెబ్యూ నామినేటెడ్​)
  • ఉత్తమ నటుడు(ఎం.ఎస్​ ధోనీ)

ఆత్మహత్యకు అదే కారణమా?

ఆరు నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని.. అందుకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సుశాంత్‌ స్నేహితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే, శనివారం రాత్రి తనకు అత్యంత ఆప్తులైన స్నేహితులను తన ఇంట్లోనే కలిశారు. అప్పుడు కూడా ఈ విషయాలేవీ వారితో పంచుకోలేదట. చాలా పొద్దుపోయిన తర్వాత సుశాంత్‌ నిద్రపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసే వ్యక్తి వచ్చినా, సుశాంత్‌ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లలేదు. అయితే, మధ్యాహ్నం మరోసారి ఇంటికి వచ్చిన అతను అప్పటికీ సుశాంత్‌ నిద్రలేవకపోవడం గమనించి తలుపును బాదాడు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడం వల్ల సుశాంత్‌ స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పగా వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని తలుపు బద్దలు కొట్టారు. అప్పటికే ఉరివేసుకుని చనిపోయి ఉన్న సుశాంత్‌ను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? తెలియాల్సి ఉంది. ఇప్పటివరకూ ఆయన గది నుంచి ఎలాంటి సుసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. కాగా, కొన్ని రోజుల క్రితం సుశాంత్‌ వ్యక్తిగత కార్యదర్శి కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

Last Updated : Jun 14, 2020, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details