ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు.. ఎద్దుల్లేక తన కుమార్తెలతో ఇటీవలే కాడి మోయించాడు. దానిని వీడియో తీసిన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎక్కడో ముంబయిలో ఉన్న ఓ సాధారణ నటుడు అది చూసి.. మీకు నేనున్నాను, తర్వాతి రోజు ఉదయానికల్లా ఎద్దుల జత అందేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చాడు. ఎద్దులైతే మళ్లీ ఇబ్బంది రావొచ్చేమోనని, ఏకంగా ట్రాక్టర్‌నే వాళ్ల ఇంటికి పంపించాడు. ఇలా వీళ్ల ఒక్క కుటుంబానికే కాదు.. లాక్డౌన్ ప్రభావంతో వలసకూలీల నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల వరకు చాలామందికి తన సొంత ఖర్చులతో చేతనైనా సాయం చేశాడు. ఏం భయపడొద్దు, తానున్నానంటూ భరోసా కల్పించాడు. భవిష్యత్తులోనూ ఎంతోమందికి ఇలానే సేవచేస్తానని చిరునవ్వుతో చెబుతున్నాడు. అతడే ప్రజలందరూ మెచ్చిన సోనూసూద్. ఈరోజు(జులై 30) 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
ఇది చదవండి: సోనూసూద్ ఇంటర్వ్యూ: 'రాజకీయ ప్రయోజనాల కోసం చేయట్లేదు'
రీల్‌లైఫ్‌లో సోనూసూద్ విలన్. తెరపై అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. విలనిజం అంటే ఇలానే ఉండాలి అనే మార్క్‌ను సృష్టించాడు. నిజజీవితంలో మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటూ అందరికీ సాయం చేస్తున్నాడు. ఒకప్పుడు సోనూ అంటే పేరు మాత్రమే. ఇప్పుడు మాత్రం వలసకూలీల పాలిట దైవంగా మారాడు.
లాక్డౌన్లో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల ఇబ్బందులు తెలుసుకున్న సోనూసూద్.. తన సొంత ఖర్చుతో వీలైనంత మందిని వారి స్వస్థలాలకు చేర్చాడు. ముంబయి కార్పొరేషన్‌తో కలిసి, పేదలకు ప్రతిరోజూ ఉచితంగా భోజనమూ అందించాడు. ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకున్న సోనూసూద్.. కూలీలతో తన అనుభవాలు పుస్తక రూపమివ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇది చదవండి:సోనూసూద్ ప్రత్యేక ఇంటర్వ్యూ: అలా చేయడం నా బాధ్యత
లాక్డౌన్ సమయంలో మరణించిన, గాయపడిన వలసకూలీల కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు సోనూసూద్. ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి 400 కుటుంబాల జాబితా తెప్పించి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.
దీనితోపాటే లాక్డౌన్ వల్ల ఉఫాది కోల్పోయిన వలస కార్మికుల సంక్షేమం కోసం 'ప్రవాసీ రోజ్‌గార్' పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చాడు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పనలో భాగంగా ఓ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి.