బాలీవుడ్ కథానాయకుడు రితేష్ దేశ్‌ముఖ్ షేర్ చేసిన వీడియో గుండెను పిండేస్తోంది. ఆయన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ 75వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ రితేష్, జెనీలియా ఎమోషనల్ వీడియోలు షేర్ చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుకున్న దుస్తుల్ని హత్తుకుంటూ.. నిజంగా చనిపోయిన తండ్రి దగ్గరున్నట్లు ఫీల్ అయ్యారు రితేష్.
"పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. మిమ్మల్ని రోజూ మిస్ అవుతున్నా" అని రితేష్ ట్వీట్ చేశారు. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న కుర్తా స్లీవ్‌లోకి ఓ చేతిని ఉంచి.. తండ్రి తనను హత్తుకున్నట్లుగా రితేష్ వీడియోలో ఫీల్ అయ్యారు. బ్యాక్‌గ్రౌండ్‌లో 2012 'అగ్నిపత్' సినిమాలోని అభి ముజే.. గీతం వినిపించింది.
ఈ వీడియోను చూసిన అనేక మంది ప్రముఖులు స్పందించారు. భావోద్వేగానికి గురి చేశావని రితేష్‌తో అన్నారు. అభిషేక్ బచ్చన్, దేవిశ్రీ ప్రసాద్, మంచు లక్ష్మి, సుదీప్, ప్రియా గుప్తా, క్రికెటర్ హర్భజన్ సింగ్ తదితరులు కామెంట్లు చేశారు.
రితేష్ సతీమణి, నటి జెనీలియా కూడా తన మామయ్యను సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. "మీరే మా గర్వకారణం. మీరున్న భావన ప్రతి రోజూ కలుగుతోంది. మీరు ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని సంరక్షిస్తుంటారని తెలుసు. మీరు మాలోనే ఉన్నారు.. హ్యాపీ బర్త్‌డే" అని పోస్ట్ చేశారు.
1945, మే 26న జన్మించిన విలాసరావు దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర సీఎంగా, కేంద్రమంత్రి పలు పదవుల్లో పనిచేశారు. 2012లో కాలేయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. విలాసరావుకు నలుగురు కుమారులు ఉన్నారు.