తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ తొలి హీమ్యాన్.. యాక్షన్ కింగ్ ధర్మేంద్ర

50 ఏళ్ల నటజీవితంలో ఎంతోమంది అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు బాలీవుడ్​ నటుడు ధర్మేంద్ర. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక హిట్స్ దక్కించుకున్న రికార్డు.. ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది. మంగళవారం ఈయన 85వ జన్మదినం సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం.

Bollywood Actor Dharam Singh Deol Birthday Special Story
అభిమానుల గరమ్ ధరమ్... ధర్మేంద్ర

By

Published : Dec 8, 2020, 5:36 AM IST

బాలీవుడ్‌ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా పేరొందిన ధర్మేంద్ర.. వెండితెరపై 'తొలి హీమ్యాన్‌', 'యాక్షన్‌ కింగ్‌' అనే గుర్తింపు తెచ్చుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన ఈయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.

వ్యక్తిగతం

ధరమ్‌సింగ్‌ డియోల్‌గా పంజాబ్‌లోని నస్రాలీలో ధర్మేంద్ర జన్మించారు. 'ఫిలింఫేర్‌' పత్రికలో గురుదత్, బిమల్‌రాయ్‌ ఇచ్చిన ప్రకటన చూసి ఆకర్షితుడయ్యారు. సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన ఫొటో వివరాలు పంపి, 'న్యూ టాలెంట్‌' అవార్డు గెలుచుకున్నారు. ఆపై 'దిల్‌భీ తెరా హమ్‌భీ తేరే' (1960)తో వెండితెరపై అరంగేట్రం చేశారు. కొద్దికాలంలోనే రొమాంటిక్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ నాయికలు నూతన్, నందా, సైరాబాను, మీనాకుమారి, హేమమాలిని లాంటి వారితో కలిసి తెరపై రొమాన్స్‌ పండించారు.

ధర్మేంద్ర

అంతకు ముందే తనకు పెళ్లయినా సినిమాల్లోకి చేరాక ఏరికోరి మరీ హేమమాలిని పెళ్లి చేసుకున్నారు. హేమమాలినితో ఈషా దేఓల్, అహనా దేఓల్‌లకు తండ్రి అయ్యారు. 'పూల్‌ ఔర్‌ పత్థర్‌', 'షోలే', 'ధరమ్‌ వీర్‌' లాంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు పొందారు.

హేమామాలినిని వివాహమాడి....

ధర్మేంద్రకు తన 19వ ఏటనే 1954లో ప్రకాశ్​ కౌర్​తో వివాహమైంది. వారికి సన్నీ దేఓల్, బాబీ దేఓల్ ఇద్దరు కుమారులు, విజేత, అజీత పేర్లు గల ఇద్దరు కుమార్తెలు. కొడుకులిద్దరూ బాలీవుడ్ నటులుగా రాణిస్తున్నారు. 1970లో 'తుమ్ హసీన్ మై జవాన్' సినిమా షూటింగ్​ సందర్భంగా ధర్మేంద్ర హేమామాలినితో ప్రేమలో పడ్డారు. సంజీవ్ కుమార్, జితేంద్ర.. హేమామాలినిని వివాహమాడాలని ప్రయత్నం చేశారు. కానీ హేమ.. ధర్మేంద్ర వైపే మొగ్గింది. పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రను హేమ మొదట్లో ఇష్టపడకపోయినా, తర్వాత తర్వాత ఆమె అతనికి ఆకర్షితురాలైంది. అది హేమ తల్లికి గాని, తండ్రికి గాని ఇష్టం లేదు. ఆమె తండ్రి చనిపోయాక వీరి పెళ్లి జరిగింది. ధర్మేంద్ర తొలి భార్యకు విడాకులు ఇవ్వజూపాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అప్పుడు ఇస్లాం మతం పుచ్చుకొని 1980లో ధర్మేంద్ర.. హేమామాలినిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. ఈషా దేఓల్, అహనా దేఓల్.

ధర్మేంద్ర, హేమామాలిని

పురస్కారాలు

ధర్మేంద్రకు భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన నిర్మించిన 'ఘాయల్' చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. 'మేరా గామ్ మేరా దేశ్', 'యాదోం కి బారాత్', 'రేషమ్ కి డోరి', 'నౌకర్ బీవి కా' చిత్రాలలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా బహుమతులు అందుకున్నారు. 'వరల్డ్ ఐరన్ మ్యాన్' బిరుదు లభించింది. ఎన్నో సంస్థలనుంచి జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు.

  • 2011లో ‘ఇండియా గాట్ ట్యాలెంట్’ రియాలిటీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 1983లో ధర్మేంద్ర తన పెద్దకుమారుడు సన్నీ దేఓల్​తో ‘విజేతా ఫిలిమ్స్’ నిర్మాణ సంస్థ నెలకొల్పారు. ఆ బ్యానర్ మీద తొలి చిత్రంగా ‘బేతాబ్’ నిర్మించారు. సన్నీ దేఓల్​కు హీరోగా అదే తొలి చిత్రం. ఈ సినిమా బ్లాక్ బస్టర్​గా నిలిచింది. 1990లో నిర్మించిన ‘ఘాయల్’ చిత్రానికి ఏడు ఫిలింఫేర్ బహుమతులు రావడం విశేషం. వీటితోబాటు 'ఘాయల్' చిత్రానికి జాతీయ బహుమతి కూడా వచ్చింది.
    ధరమ్​ ఔర్​ ధనూన్​
  • రాజస్థాన్​లోని బికనీర్ లోక్​సభ పార్లమెంటరీ స్థానానికి 2004-09 మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మేంద్ర ఎన్నికయ్యారు. కానీ పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని సభ్యుడిగా ముద్రపడ్డారు. ఫామ్​హౌస్​ పనులకు, సినిమా షూటింగులకు ఇచ్చినంత విలువ పార్లమెంటు సభ్యత్వానికి ఇవ్వలేదనే విమర్శ ఆయనపై ఉంది.
    కుటుంబంతో ధర్మేంద్ర
  • తన మాతృభాష పంజాబీ చిత్రాలకూ ధర్మేంద్ర పనిచేశారు. వాటిలో 'దో షేర్', 'దుఖ్ భంజన్ తేరా నామ్', 'తేరి మేరి ఇక్ జిన్ద్రి', 'కుర్బాని ఝాట్ కి' చిత్రాలు ఉన్నాయి. ధర్మేంద్ర ఎక్కువమంది దర్శకులతో పనిచేశారు. 1960 నుంచి 1990 దాకా తనను తొలిసారి వెండితెరకు పరిచయం చేసిన అర్జున్ హింగోరని తో చాలా సినిమాలకు పనిచేశారు. హింగోరని దర్శక నిర్మాతగా వ్యవహరించిన 'కబ్', 'క్యోం అవుర్ కహా', 'కహాని కిస్మత్ కి', 'ఖేల్ ఖిలాడి కా', 'కాతిలోం కే కాతిల్', 'కౌన్ కరే కుర్బాని', 'సుల్తానత్', 'కరిష్మా కుద్రత్ కా' సినిమాలూ ఉన్నాయి.
    ధర్మేంద్ర, మీనాకుమారి
  • 'యకీన్' (హీరో, విలన్ గా), 'సమాధి' (తండ్రి, కొడుకుగా), 'ఘజబ్' (కవల సోదరులుగా), 'ఝూటా సచ్' (ఒకే పోలికలు గల సంబంధం లేని యువకులుగా) సినిమాలలో ధర్మేంద్ర ద్విపాత్రాభినయం చేశారు. జీవో షాన్ సే సినిమాలో మూడు పాత్రలు పోషించారు.
  • ధర్మేంద్ర సరసన నటించని హీరోయిన్లు లేరంటే నమ్మక తప్పదు. బాలీవుడ్ హీరోయిన్లే కాకుండా సుచిత్రాసేన్(మమత), జయలలిత(ఇజ్జత్), సావిత్రి(గంగాకి లహరే) వంటి హీరోయిన్ల సరసన నటించిన స్టార్​ ధర్మేంద్ర. హేమామాలిని దర్శకత్వం వహించిన 'టెల్ మీ ఓ ఖుదా' చిత్రంలో కుమార్తె ఈశాతో కలిసి నటించారు.

ABOUT THE AUTHOR

...view details