తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్ 50 ఏళ్ల నట ప్రస్థానం.. అభిషేక్ భావోద్వేగం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినీ రంగ ప్రవేశం చేసి నేటికి 50 ఏళ్లయ్యాయి. బిగ్​బీ మొదటి సినిమా 'సాత్ హిందుస్థానీ' నవంబర్ 7, 1969లో విడుదలైంది.

అమితాబ్

By

Published : Nov 7, 2019, 3:08 PM IST

Updated : Nov 7, 2019, 3:21 PM IST

అమితాబ్ బచ్చన్.. 70వ దశకంలో యాంగ్రీ యంగ్​మ్యాన్​గా.. 80వ దశకంలో సూపర్​స్టార్​గా... 90వ దశకంలో బాలీవుడ్ బిగ్​బీగా... ఈ మిలీనియంలో నవతరానికి ఆదర్శంగా నిలుస్తూ.. కాలంతో పాటు తను ఎంచుకునే పాత్రల్లో మార్పు తీసుకొస్తూ ఒదిగిపోయిన నటుడు. ఏకైక మెగాస్టార్ అమితాబ్​ బచ్చనే అని చిరంజీవి అన్నారంటే ఆయన గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. కెరీర్​లో ఎన్నో మైలురాళ్లు సాధించిన బిగ్​బీ సినీ ఇండస్ట్రీకి పరిచయమై నేటికి 50 ఏళ్లు.

1969లో ప్రసిద్ధ పాత్రికేయుడు కేఏ అబ్బాస్‌.. అమితాబ్‌కు మొదటి అవకాశం ఇచ్చారు. సాత్ హిందుస్థాని పేరుతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కానీ అందులో ఉన్న ఏడుగురు హీరోల్లో అమితాబ్‌ తళుక్కున మెరిశారు. ఆయన గొంతు అందర్నీ ఆకర్షించింది. ఈ సినిమాలో ఆయన నటనకు జాతీయ అవార్డు లభించింది.

ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు బిగ్​బీ. 200 పైచిలుకు చిత్రాల్లో కనిపించి నటప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 4 జాతీయ పురస్కారాలు గెల్చుకున్నారు. ఫిల్మ్​ఫేర్​ అవార్డులకు 41 సార్లు నామినేట్ అయితే 15 సార్లు విజేతగా నిలిచారు. ఇటీవలే సినీ అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్​ ఫాల్కే' అవార్డును కైవసం చేసుకున్నారు.

అభిషేక్​ ట్వీట్

తండ్రి అమితాబ్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ తనయుడు అభిషేక్ బచ్చన్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

అభిషేక్, అమితాబ్

"నేనొక కొడుకుగానే కాకుండా.. ఒక నటుడు, అభిమానిగా ఆయన సినీ ప్రయాణంలో భాగమవడం గర్వంగా ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అమితాబ్ కాలంలో మేమూ ఉన్నామని కొన్ని తరాలు చెప్పుకుంటాయి. సినీ కెరీర్​లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు నాన్న. లవ్ యూ."
-అభిషేక్ బచ్చన్, సినీ నటుడు

అమితాబ్, అభిషేక్ కలిసి పలు చిత్రాల్లో నటించారు. సర్కార్, పా, బంటీ ఔర్ బబ్లీ, కభి అల్విదా నా కెహ్న వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

ఇవీ చూడండి.. ర‌వితేజ కోసం తమిళ దర్శక నటుడు..

Last Updated : Nov 7, 2019, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details