బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్ బుధవారం 61వ పడిలోకి అడుగుపెట్టాడు. అభిమానులు అతడిని ముద్దుగా 'మున్నాబాయ్' అని పిలుచుకుంటారు. ఈ సందర్భంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' నుంచి సంజయ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ప్రతినాయకుడు 'అధీరా' పాత్రలో కనిపించనున్నాడు.
సంజయ్ నెగిటివ్ రోల్స్ చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలోనూ అనేక చిత్రాల్లో విలన్‌గా మెప్పించాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా.. సంజయ్ దత్ పోషించిన కొన్ని ప్రతినాయక పాత్రలపై ఓ లుక్కేద్దాం రండి.
1981లో విడుదలైన 'రాకీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంజయ్ దత్.. తొలి చిత్రంతోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే 1990లో వచ్చిన 'జహ్రీలే' సినిమాలో తొలిసారి విలన్ పాత్ర పోషించాడు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా.. సంజయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సంజయ్ నటించిన 'ఖల్ నాయక్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుభాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజు భాయ్ ప్రతినాయకుడిగా కనిపించాడు. 1993లో విడుదలైన ఈ సినిమా.. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.
1999లో వచ్చిన 'కార్టూస్' చిత్రంలో క్రిమినల్ రాజాగా నటించాడు సంజయ్. పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించిన జాకీ ష్రాప్.. అండర్ వరల్డ్ డాన్‌ను పట్టుకునేందుకు దత్‌కు శిక్షణ ఇస్తాడు. ఈ సినిమాలో సంజయ్ నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.