ఆ కళ్ళు వెన్నెల వాకిళ్లు. కమ్మని కలల లోగిళ్లు. ఎలాంటి భావోద్వేగాన్ని అయినా చిటికెలో వ్యక్తీకరించే సుందర, సుమధుర కావ్యాలు. అందం, అభినయం, నాట్యం మేలి కలయిక శోభన. సినిమాల్లో నటించినా ఎక్కడా హుందాతనాన్ని కోల్పోలేదు. సంప్రదాయ చీరకట్టులో మెరిసినా, మోడ్రన్ డ్రెస్‌లో మాయ చేసినా తను తనలాగే ఉంది తప్ప ఎక్కడా అతి కనిపించనీయలేదు. అందుకే...శోభనను వినయ శీలి అని ఆమె ఆత్మీయులు తెగ మెచ్చుకుంటారు. ఒక్కసారి ఆమె అలవోకగా నిలిచిందా? అజంతా గుహల నుంచి పారిపోయి వచ్చిన ఓ అత్యద్భుత శిల్ప సౌందర్యం కళ్లెదురుగా కనిపించినంత ఆనంద పరవశులవుతారు ఆమె అభిమానులు. అడుగు కదిపిందా? ముగ్ధమోహనత్వంతో ఆ అష్టపదులు నర్తించినట్లేనంటారు. ఇటు సినిమాలకు గ్లామర్ అద్దింది. క్లిష్టమైన సన్నివేశాల్లో అభినయాన్ని జోడించింది. నాట్య కళాకారిణిగా శోభ తెచ్చింది. తనకెంతో పేరు తెచ్చిన పాపులర్ మీడియా సినిమా అంటే అంతులేని అభిమానం. ఇష్టపడి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యమంటే ప్రాణం...ప్రణవం...సర్వం.
ఔను...ఆమె మనసంతా భావరాగతాళమయం. తనువంతా భరత నాట్యం. అందుకే ఆమె సినిమాలకు దూరంగా, తన మనసుకు నచ్చిన నాట్యానికి మరింత దగ్గరగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. శోభన భారతదేశం గర్వించదగ్గ అభినయ తారక. ఆమె ప్రతిభ బహుముఖం. ఆమె నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, మృదంగ కళాకారిణి. అంతేనా? తాను ప్రదర్శించే నృత్య ప్రదర్శనలకు క్రియేటర్, స్క్రిప్ట్ రైటర్. రంగస్థల రూపకర్త.. ఇలా అన్ని విభాగాల్లో సృజనను ఆవిష్కరించే కళాకారిణి. కేవలం తెరపై మిలమిల మెరిసే నాయిక మాత్రమే కాదు. నాట్యరాణి. ప్రస్తుతం తానెంతో ఇష్టపడి నేర్చుకున్న భరతనాట్యాన్నే ఆరాధిస్తూ... అర్చిస్తూ దేశవిదేశాల్లో అవిశ్రాంతంగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ నృత్య కళామతల్లి సేవకే అంకితమైంది. క్లాసిక్ డాన్సర్‌గా శోభన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకుంది.
వారసత్వంగా నాట్యవైభవం
ట్రావెన్కోర్ సిస్టర్స్‌గా ప్రసిద్ధి పొందిన లలిత, పద్మిని, రాగిణి నాట్య కళాకారిణులకు శోభన స్వయానా మేనకోడలు. క్లాసికల్ ఇండియన్ డాన్సర్స్గానే కాకుండా నటీమణులుగానూ వీరు పేరు పొందారు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నదేమో... సినీ, క్లాసిక్ డాన్స్ రంగాల్లో ప్రతిభ చూపిస్తోంది శోభన. 1970 మార్చి 21న కేరళ తిరువనంతపురంలో పుట్టిన ఈమె, దక్షిణాదిలోని అన్ని భాషాల్లోనూ నటించింది. 1980-1990 మధ్యలో మలయాళం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలతో మెప్పించింది. మరో ప్రఖ్యాత నటి రేవతి దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ చిత్రంలోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. 2002లో విడుదలయిన 'మిత్ర.. మై ఫ్రెండ్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 49వ జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ ఇంగ్లీష్ చిత్రంగా పురస్కారాన్ని పొందింది. ఉత్తమ నటిగా శోభన, ఉత్తమ ఎడిటర్‌గా బీనాపాల్ అవార్డులను అందుకున్నారు.
భారతీయ సంప్రదాయాల్లో పెరిగిన ఓ యువతి వివాహం కారణంగా విదేశానికి వెళ్లి, అక్కడి సంస్కృతిలో ఇమడలేక ఇబ్బంది పడడమే కాదు... తన కూతురు ఆ సంస్కృతికి ఆకర్షితురాలవడాన్ని నివారించలేని పరిస్థితిలో ఇంటర్నెట్ ద్వారా పరిచితమైన ఓ ఫ్రెండ్‌తో ఏర్పడిన అనుబంధమే ఈ చిత్ర ఇతివృత్తం. రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయిన హీరోయిన్గా శోభన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు.
బాలనటిగా తెరంగేట్రం
శోభన బాలనటిగా అరంగేట్రం చేసింది. 1970లో పుట్టిన ఈమె, 1972లోనే కెమెరా ముందుకు వచ్చింది. 'అమర్ ప్రేమ్'.. బాలనటిగా ఆమెకు తొలి చిత్రం. పెద్దయిన తరువాత ఆమె హీరోయిన్గా నటించిన తొలి సినిమా 'ఏప్రిల్ 18'. 1984లో రూపొందిన ఈ మలయాళ చిత్రానికి రచన, దర్శకత్వంతో పాటు హీరోగా బాలచంద్ర మేనన్ పనిచేశారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే శోభన ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఆ తరువాత ఆమె వరుసగా సినిమాలు చేసింది. అనతి కాలంలోనే కోలీవుడ్లోకి ప్రవేశించి ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంలో 'ఎనక్కుళ్ ఒరువన్'లో నటించింది. ఈ చిత్రం ఆశించినంత ఫలితం సాధించకపోవడం వల్ల తమిళ చిత్ర పరిశ్రమకు కాస్తంత విశ్రాంతి ఇచ్చి కేవలం మలయాళ చిత్రాలకే పరిమితమైంది.