బయోపిక్‌లు... ప్రస్తుతం సినీ పరిశ్రమలో ట్రెండింగ్. ప్రముఖ వ్యక్తుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాల విజయాల శాతం ఎక్కువ. వాణిజ్యపరంగానూ లాభాలొస్తున్నాయి. కొన్ని చిత్రాలు కొంతమందిని ప్రజలకు తెలిసేట్లు చేస్తే.. మరికొన్ని ప్రముఖుల గొప్పతనాన్ని గుర్తుచేశాయి. బయోపిక్‌లతో ప్రాచుర్యం పొందిన కొంతమంది వ్యక్తుల గురించి.. ఆ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం!
మహానటి
సావిత్రి... ఆ తరం వాళ్లకే కాదు నేటి తరానికీ గుర్తుండి పోయే నటి. ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ. 'మహానటి' చిత్రంతో సావిత్రి జీవితంలోని కష్టసుఖాలను చూపించాడు దర్శకుడు. నటి అయిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆమె ఎదుర్కొన్న సంఘర్షణలు కళ్లకు కట్టారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత సావిత్రి గొప్పతనం గురించి ప్రతి తెలుగువాడికి తెలిసింది. 2018లో విడుదలైన ఈ చిత్రంలో కీర్తి సురేశ్.. ఆ మహానటి పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవలే ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో మూడు అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం.
మాంఝీ-ద మౌంటేన్ మ్యాన్
'మాంఝీ-ద మౌంటేన్ మ్యాన్' సినిమా రాకముందు ఈయన గురించి చాలామందికి తెలియదు. ప్రేమ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కడితే... అదే ప్రేమ కోసం కొండను కూల్చేశాడు మన మాంఝీ. బిహార్‌కి చెందిన ఈయన గ్రామానికి సమీపంలో ఓ కొండ ఉండేది. ఆ గ్రామానికి వెళ్లాలంటే ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. గర్భవతిగా ఉన్న తన భార్య ఓ రోజు కొండ పైనుంచి పడి చనిపోతుంది. తన భార్య చావుకు కారణమైన ఆ పర్వతాన్ని ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లపాటు కష్టపడి.. తొలిచేసి మార్గాన్ని ఏర్పాటు చేశాడు.
మౌంటేన్ మ్యాన్ (పర్వత మనిషి)గా పిలుచుకునే మాంఝీ 2007లో మరణించాడు. 2015లో బాలీవుడ్లో వచ్చిన ఈయన బయోపిక్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు.