తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాస్తవాల బాట.. టాలీవుడ్​లో వినోదాల ఆట

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం బయోపిక్​లతో పాటు నిజజీవిత కథలతో సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. మిగతా చిత్రాల కంటే ఇలాంటి వాటిపైనే కథానాయకులు ఆసక్తి చూపిస్తున్నారు.

BIOPIC MOVIES IN TOLLYWOOD IN 2021
వాస్తవాల బాట.. టాలీవుడ్​లో వినోదాల ఆట

By

Published : Apr 19, 2021, 6:31 AM IST

కల్పిత గాథలు.. చారిత్రక కథలు.. నిజ జీవితాలతో రూపొందే బయోపిక్‌లు.. ఇలా రకరకాల కథలతో సినిమాలు వస్తుంటాయి. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు భిన్నమైన రుచుల్ని పంచుతుంటాయి. కొద్దిమంది జీవితాలే సినిమా కథలకు స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. అవే బయోపిక్‌లుగా తెరపైకొస్తున్నాయి. కొన్ని రచనలు సినిమాలుగా మారిపోతుంటాయి. సినిమాల్ని చూసి కూడా కొత్త సినిమా కోసం కథలు రాసేవాళ్లూ ఉన్నారు! ఇలా కథలు ఎప్పుడు ఎక్కడి నుంచి పుడతాయో ఊహించలేం. కథంటే... కథే కాదు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటనే సినిమా కథగా రూపాంతరం చెందుతుంది. అలా చాలా నిజ జీవిత సంఘటనలతో రూపొందిన సినిమాలు చాలానే! ఇప్పుడు కూడా అలాంటి కథలతో సెట్స్‌పై ఉన్న సినిమాలు.. ఆరంభం కాబోతున్న సినిమాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ప్రపంచ సినిమాను చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వాళ్లు మన సినిమాల్లోనూ మార్పులు కోరుకుంటున్నారు. కృత్రిమ కథల్ని... తర్కానికి అందని గాథల్ని చూడటం మానేశారు. చిత్రసీమ కూడా ఆ అభిరుచుల్ని గమనిస్తూ... వాస్తవికత ఉట్టిపడే కథలకు పెద్దపీట వేయడం మొదలుపెట్టింది. దానికితోడు యువతరం పరిశ్రమలోకి అడుగు పెట్టడం వల్ల వాళ్లే నేటి ప్రేక్షకుల ఇష్టాలకు తగిన కథల్ని సిద్ధం చేసుకుంటూ సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. దాంతో వాస్తవ సంఘటనలతో తెరకెక్కే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్‌' మొదలుకొని మొన్నటి 'వైల్డ్‌డాగ్‌' వరకు కూడా నిజ జీవిత సంఘటనలతో రూపొందినవే. మరికొన్ని ఆ దారిలో సిద్ధమవుతున్నాయి.

* 'క్రాక్‌' సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. తదుపరి ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆ చిత్రం కోసం నిజ జీవిత ఘటనలతోనే కథను సిద్ధం చేస్తున్నారు. అందుకోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు, పత్రికలు తిరగేస్తూ పరిశోధన కూడా చేస్తున్నారు. కథానాయకుడు రవితేజ కూడా మరోసారి అలాంటి కథకే పచ్చజెండా ఊపేశారు. రచయిత శరత్‌ మండవ రవితేజ కోసం కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్క్రిప్టును సిద్ధం చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఆ చిత్రం ఇటీవలే ఆరంభమైంది.

రవితేజ-రానా-సాయితేజ్

* 'వైల్డ్‌డాగ్‌'లో ఎన్‌.ఐ.ఎ అధికారిగా నటించారు నాగార్జున. ఎన్‌.ఐ.ఎ అధికారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్లు దేశం కోసం ఎలాంటి సాహసాలు చేస్తారనే విషయాల్ని అందులో చూపించారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ‘వైల్డ్‌డాగ్‌’ కథని రాసుకున్నట్టు ఆ చిత్ర దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ చెప్పారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న నాగార్జున కొత్త చిత్రం కూడా వాస్తవ ఘటనలతో రూపొందుతున్న కథే అని తెలిసింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఆ సినిమా రూపొందుతోంది. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. "వాస్తవికతతో కూడిన కథల్లో నటించడం ఎప్పుడూ ఆసక్తికరమే. నటులుగా మేం కూడా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ పనిచేస్తుంటాం. విడుదల తర్వాత ఆ సినిమాలు ప్రేక్షకులకూ కొత్త అనుభవాన్ని పంచుతాయి" అని చెబుతారు నాగార్జున.

యువ కథానాయకులు రానా, సాయితేజ్‌ ఒప్పుకొన్న కొత్త చిత్రాలకు కూడా వాస్తవ ఘటనలే స్పూర్తి అని తెలుస్తోంది. వెంకీ అనే ఓ కొత్త దర్శకుడు రానా దగ్గుబాటితో సినిమా చేయడం కోసం 1940 నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేశారు. ఆ కథకు అప్పట్లో జరిగిన సంఘటనలే స్ఫూర్తి అని సమాచారం. సాయితేజ్‌ కథానాయకుడిగా ఓ థ్రిల్లర్‌ రూపొందబోతోంది. 'రంగస్థలం' తరహాలో పీరియాడికల్‌ కథతో రూపొందనున్న ఆ సినిమాకు సుకుమార్‌ కథ సమకూర్చారు. కార్తీక్‌ వర్మ దర్శకత్వం వహిస్తారు. అది కూడా నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్నదే. రానా 'విరాటపర్వం' కూడా కొన్ని నిజమైన ఘటనల్ని ప్రతిబింబించేదే.

"సినిమా కథకు ఒక ఆలోచనో, ఒక రచనో, లేదంటే నిజంగా జరిగిన ఒక సంఘటనో స్ఫూర్తి కావొచ్చు. కానీ కథ మొత్తం ఆ ఘటనే ఉండదు. అంతిమంగా సినిమాకు తగ్గట్టుగా అందులో కల్పితాల్ని జోడించాల్సిందే. వాస్తవ ఘటనలతో సినిమా చేయడం ఎంత సులభమో, అంత కష్టం కూడా. చాలా మందికి తెలిసిన విషయాలే ఉంటాయి కాబట్టి... పోల్చి చూసుకునే అవకాశం ఉంటుంది" అని అన్నారు ఓ దర్శకుడు.

ABOUT THE AUTHOR

...view details