కరోనా వైరస్ సినీ ప్రియులకు వెండితెర వినోదాన్ని దూరం చేసింది. ప్రత్యమ్నాయంగా వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ గత ఆరునెలలుగా ప్రేక్షకుల పాలిట థియేటర్‌గా మారింది. ఇప్పట్లో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశాలు లేకపోవడం వల్ల.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను డిజిటల్ వేదికల ద్వారా విడుదల చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు దర్శక నిర్మాతలు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా విడుదలైతే చాలు అనుకుంటూ ముందుకెళ్తున్నారు.
మరోవైపు బడ్జెట్ భారంగా మారుతుండటం వల్ల దర్శక నిర్మాతలు వీటికే ఓటు వేస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త నటీనటుల దగ్గర నుంచి అగ్రశేణి తారల చిత్రాలూ ఓటీటీ బాటపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 25 సినిమాలు విడుదలయ్యాయి. ఒకటీ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మిగిలిన సినిమాలన్నీ మిశ్రమ ఫలితాలనందుకున్నాయి.
ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్
లాక్డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన తొలి చిత్రం 'అమృతరామమ్'. థియేటర్ల పునః ప్రారంభం ప్రశ్నార్థకంగా ఉన్నందు వల్ల మరిన్ని సినిమాలు ఇదే బాటలో నడిచాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కృష్ణ హిజ్ లీలా'తోపాటు కీర్తి సురేశ్ 'పెంగ్విన్', '47 డేస్', 'జోహార్', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', 'బుచ్చినాయుడు కండ్రిగ', 'వి', 'అమరం అఖిలం ప్రేమ' చిత్రాలను బుల్లితెరలోనే చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో సీని ప్రియుల్ని పెద్ద ఎత్తున ఓటీటీ వైపు మళ్లించడంలో పలు చిత్రాలు విజయం సాధించాయి.
వాటిలో భారీ అంచనాలతో విడుదలైన కీర్తి సురేశ్ 'పెంగ్విన్', నాని 'వి' సినిమాలు మిశ్రమ ఫలితాన్ని దక్కించున్నాయి. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'అమరం అఖిలం ప్రేమ' చిత్రాలకు మంచి ఆదరణ లభిచింది. తెలుగు సినిమాలతో పాటు 'ఫోరెన్సిక్', 'ట్రాన్స్', '36 వయస్సులో', 'మగువలు మాత్రమే', 'బంగారుతల్లి' వంటి అనువాద చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. మరోవైపు సూర్య నటించిన 'అకాశమే నీ హద్దురా' కూడా ఇదే ప్లాట్ఫామ్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.