తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటనతో మమేకం.. అవార్డులు దాసోహం - దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

ఏడు పదుల వయసు దాటినా అదే ఉత్సాహం.. అలసట తెలియని మనస్తత్వం.. నటనతో మమేకం... పురస్కారాలు దాసోహం... విశిష్ట సేవా దృక్పథం.. ఒకటేమిటి అమితాబ్ బచ్చన్​ గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకాలు చాలవు.. బయోపిక్​లా తీయాలంటే రీళ్లు చాలవు. చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన 'దాదాసాహెబ్​ ఫాల్కే' పురస్కారాన్ని ఆయన నేడు స్వీకరించిన  సందర్భంగా బిగ్​ బీ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం!

Big Got Dada Saheb Phaklke Award
నటనతో మమేకం.. అవార్డులు దాసోహం

By

Published : Dec 29, 2019, 7:41 PM IST

ఆల్​ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే.. నీ గొంతు బాగోలేదు అన్నారు.. ఇప్పుడు ఆ గొంతుకు కాపీ రైట్సే ఉన్నాయి. హీరో అవ్వాలని అవకాశాల కోసం దర్శకుల చుట్టూ తిరిగితే.. నువ్వేమి హీరో అవతావు అంటూ చీదరించుకున్నారు.. ఇప్పుడు దర్శకులు ఆయన కాల్షీట్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.. ఇలా ఛీత్కారాల నుంచి సత్కారాల వరకు సాగింది అమితాబ్ బచ్చన్ ప్రస్థానం. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు తీసుకున్న సందర్భంగా బిగ్​ బీ సినీ కెరీర్​పై ఓ లుక్కేద్దాం!

అమితాబ్​కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం

ఉత్తర్‌ప్రదేశ్‌ అలహాబాద్‌లో కళాకారుల ఇంట 1942 అక్టోబరు 11న అమితాబ్‌ జన్మించారు. తండ్రి హరివంశ్‌రాయ బచ్చన్‌ ప్రముఖ హిందీ కవి. తల్లి తేజీ బచ్చన్‌ సిక్కు మతస్థురాలు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తితో నాటకాల్లో నటించేవారు అమితాబ్.

నాటకంలో నటిస్తోన్న అమితాబ్

"బాల్యం నుంచి నాకు నాటకాలంటే చాలా ఇష్టం. చిన్నతనంలో రకరకాల పాత్రలు వేశా. అదృష్టవశాత్తూ సినిమాల్లోకి వచ్చి పడ్డా. నాటకాల్లోని నా అనుభవం నటుడిగా కొనసాగడానికి ఎంతో ఉపయోగపడింది" - అమితాబ్ బచ్చన్

నీ గొంతు బాగోలేదు..

చదువు పూర్తయిన తర్వతా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు బిగ్​బీ. ఆల్‌ ఇండియా రేడియోలో అనౌన్సర్‌ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ‘నీ గొంతేమీ బాగోలేదు’ అని అక్కడి అధికారులు అవహేళన చేశారు. ఆపై కోల్‌కతాలో షిప్పింగ్‌ కంపెనీలో చేరారు. కానీ, ఆయనకు ఆ ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. ఆ ఉద్యోగం నచ్చక.. రాజీనామా చేసి దిల్లీకి వచ్చేశారు.

హీరో అవుతావా.. అంటూ అవమానం

ఎలాగైనా నటుడు కావాలని 1968లో ముంబయికి వచ్చేశారు అమితాబ్​. దర్శక, నిర్మాతల దగ్గరికి వెళితే. ‘నువ్వేమి హీరో అవుతావు.. పో..’ అనేవారు. అమితాబ్‌ తలవంచుకుని వెళ్లిపోయేవారు. రాత్రిపూట ఆకలితో ఒంటరిగా నిద్రపోయేవారు.

యాంగ్రీయంగ్​మ్యాన్​గా బిగ్​బీ

రూ.10 వేలు వద్దనుకుని..

ఇంతలో ఓ రోజు అవకాశం వెతుక్కుని వచ్చింది. యాడ్‌ ఫిల్మ్‌లో మోడల్‌గా రూ.10 వేలు పారితోషికం. డబ్బు కాదు.. సినిమా ప్రధానం అనుకుని.. ఆ అవకాశాన్ని వదులుకున్నారు. 1969లో ప్రసిద్ధ పాత్రికేయుడు కేఏ అబ్బాస్‌ అమితాబ్‌కు మొదటి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. కానీ అందులో ఉన్న ఏడుగురు హీరోల్లో అమితాబ్‌ తళుక్కున మెరిసారు. ఆయన గొంతు అందర్నీ ఆకర్షించింది. ఈ సినిమాలో ఆయన నటనకు జాతీయ అవార్డు లభించింది.

ఏడు పదుల వయసు దాటినా అదే ఉత్సాహం

ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఏడు పదుల వయసు దాటినా ఉత్సాహంగా ఇంకా నటిస్తూనే ఉన్నారు. 200 పైచిలుకు చిత్రాల్లో కనిపించి నటప్రస్థానాన్ని కొనసాగించారు. 4 జాతీయ పురస్కారాలు గెల్చుకున్నారు. ఫిల్మ్​ఫేర్​ అవార్డులకు 41 సార్లు నామినేట్ అయితే 15 సార్లు విజేతగా నిలిచారు.

అమితాబ్ బచ్చన్​

అమితాబ్ బచ్చన్​కు రాజకపూర్ పేరిట ‘సూపర్ స్టార్ ఆఫ్ మిలీనియం 2000’ పురస్కారం ఇచ్చి గౌరవించారు. లండన్, న్యూయార్క్, హాంకాంగ్, బ్యాంకాక్, వాషింగ్టన్, దిల్లీ నగరాలలోని మేడం టుస్సాడ్ మ్యూజియంలలో అమితాబ్ బచ్చన్ మైనపు బొమ్మలను ఆవిష్కరించారు. 2011లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. ఫ్రెంచ్ ప్రభుత్వం 'నైట్ హుడ్' బిరుదుతో సత్కరించింది.

ఇదీ చదవండి: నెట్టింట వైరల్​గా 'ఆర్​ఆర్​ఆర్' పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details