బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పెళ్లినాటి ఫొటోలను బుధవారం సామాజిక మాధ్యమాల్ వేదికగా షేర్ చేశారు. నేడు అమితాబ్, జయా బచ్చన్ల 47వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆనాటి తీపి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు బిగ్ బీ.
"జంజీర్ చిత్రం విజయవంతమైన సందర్భంగా తొలిసారి కొద్ది మంది స్నేహితులతో లండన్ వెళ్లి.. సంబరాలు చేసుకుందామని అనుకున్నాం. విషయం మా నాన్నకు చెప్పగా.. 'నువ్వు ఎవరితో వెళ్తున్నావు?' అని ఆయన అడిగారు. అప్పుడు స్నేహితురాలు జయ గురించి చెప్పగా.. 'ఆమెను పెళ్లి చేసుకొని తీసుకెళ్లు. లేకపోతే వెళ్లొద్దు' అని తేల్చిచెప్పారు. నేను ఆయన మాటను అప్పడు ఇదే రోజున పాటించాను".
-అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మెగాస్టార్
అమితాబ్‌ను తొలిసారి కలిసిన రోజును జయా బచ్చన్ ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. "నేను అతడ్ని 'గుడ్డీ' సినిమా సెట్స్‌లో పరిచయం చేసుకున్నాను. అమితాబ్.. హరివంశ్రాయ్ బచ్చన్ కుమారుడు కావడం వల్ల నేను మరింత ఆకర్షితురాలిని అయ్యాను. అతడు భిన్నమైన వ్యక్తని అభిప్రాయపడ్డాను. నేను నా భావాలను వ్యక్తం చేసినప్పుడు దాన్ని నిజం చేయబోతున్నట్లు చెప్పారు. అందరిలా సాధారణమైన హీరో కాదని నాకు తెలుసు. అందుకే అతడితో చాలా త్వరగా ప్రేమలో పడ్డాను" అని జయా బచ్చన్ పేర్కొన్నారు.
అమితాబ్, జయా బచ్చన్లు 1973 జూన్ 3న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కుమార్తె శ్వేత బచ్చన్ నంద, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు.
ఇదీ చూడండి...'భవిష్యత్తును చూస్తున్నా.. ఎంతో దూరంలో లేదు'