టాలీవుడ్ హీరో నితిన్, యువ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'భీష్మ'. రష్మిక కథానాయిక. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. సేంద్రీయ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించి.. ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ప్రేక్షకులకు, దర్శకుడు వెంకీకి ధన్యవాదాలు తెలిపాడు హీరో నితిన్. ఈ చిత్ర విజయం వెనుక దర్శకుడి శ్రమ చాలా ఉందని... అతడిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు నితిన్.
"సినిమాలో కామెడీ టైమింగ్, నటన చాలా బాగుందన్నారు ప్రేక్షకులు. వెంకీ నాకు కథ చెప్పిన విధానం , యాక్టింగ్ చేసి చూపిన తీరులోనే నేను నటించాను. అచ్చం అదే కాపీ కొట్టాను. అందుకే అందరూ నా నటనను ప్రశంసిస్తున్నారు. ఎప్పటికీ ఈ విజయాన్ని మర్చిపోలేను."
-నితిన్, కథానాయకుడు.