కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల సినిమాల విడుదల ఊపందుకుంది. గత వారంలో మూడు పెద్ద స్టార్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడు భాషల్లో వచ్చిన మూడు సినిమాలు విపరీతమైన కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. భీమ్లానాయక్, వలిమై సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరగా, గంగూబాయి కతియావాడి చిత్రం కలెక్షన్లు రూ.50 కోట్లకు చేరువలో ఉన్నట్టు సమాచారం.
భీమ్లానాయక్ దెబ్బ.. బాక్సాఫీసు అబ్బా..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా నటించిన 'భీమ్లానాయక్' చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. మలయాళ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన భీమ్లా నాయక్‌కు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాసి స్క్రీన్‌ప్లే అందించారు. భీమ్లానాయక్ దెబ్బకు బాక్సాఫీసు దద్దరిల్లిపోతోంది. మొదటి ముడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఏపీలో సినిమా టికెట్ల రగడ ఇంకా నడుస్తుంది. అయినా సరే.. ధైర్యంగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. భీమ్లానాయక్‌గా పవన్, డానియల్గా రానా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు
నటనతో మెప్పించిన 'గంగూబాయి'
భీమ్లానాయక్ రిలీజైన రోజే బాలీవుడ్లో గంగూబాయి కతియావాడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలియాభట్ తన కెరీర్లో మొదటి ప్రయోగత్మకమైన చిత్రం ఇది. లేడీ డాన్ పాత్రలో ఆలియా అద్భుతంగా నటించి అభిమానులను మెప్పించింది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యంగా విడుదలైంది. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రూ.50 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
గంగూబాయి సినిమాను చుట్టుకున్న వివాదాలు బాగా హైప్ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయి కతియావాడిని వేశ్యగా చూపించారంటూ ఆమె కుమారుడు కోర్టుకు వెళ్లారు. సినిమా విడుదల కూడా ఆపేయాలని ప్రయత్నించగా.. విడుదలపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది.
దూసుకుపోతున్న 'వలిమై'
ఫిబ్రవరి 24వ తేదీన తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 'వలిమై' విడుదలైంది. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వలిమై. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యువ హీరో కార్తికేయ నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బైక్ రేసుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ బోనీ కపూర్ నిర్మించారు.
బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తమిళనాట తొలి రోజే ఈ సినిమా రూ.36 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వీకెండ్లో ఈ సినిమా జోరు గట్టిగానే కొనసాగింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా రూ.100 కోట్లపైగా వసూళ్లను సాధించిందని అంచనా. తమిళనాట మరికొన్ని రోజులు వలిమై హవా ఇలానే కొనసాగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: శివరాత్రి స్పెషల్.. 'భోళాశంకర్' స్పెషల్ వీడియో రిలీజ్