కమర్షియల్ సినిమాల ఫార్ములాను దాటి ప్రయోగాల జోలికి వెళ్లేందుకు దర్శక నిర్మాతలు భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అడపాదడపా మహిళా శక్తిని చాటే సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నారు. అలా తీసిన వాటిలో కొన్ని సంచలన విజయాలు నమోదు చేసి, కాసుల పంట పండించి సూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో నటించిన కథానాయికలు వెండితెరపై చెరగని ముద్ర వేశారు. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి గురించి, ఆ సినిమాల గురించి ప్రత్యేక కథనం.
సితార
1984లో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ 'సితార'. ఈ సినిమాలో హీరోయిన్ భానుప్రియ పలికించిన హావాభావాలు, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇళయారాజా స్వరాలను సమకూర్చాడు. సుమన్, శుభలేఖ సుధాకర్ కీలక ప్రాతధారులు.
కర్తవ్యం
రాజకీయ, యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించింది. 1990లో విడుదలైన సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథనందించారు. మోహన గాంధీ దర్శకుడు. ఇందులో విజయశాంతి నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది.
ఒసేయ్ రాములమ్మ
ఇందులోనూ విజయశాంతి ప్రధాన పాత్రధారి. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించారు. భూస్వాముల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాలు అరాచకాల నేపథ్యంలో దీనిని తీశారు. సూపర్‌స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు.
ప్రతిఘటన
ఇందులో గృహిణి పాత్రలో నటించింది లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. అధికార రాజకీయ పార్టీ అండతో సమాజంలో అక్రమాలకు పాల్పడుతున్న కొంత మంది గూండాల చేతిలో ఆమె జీవితం ఛిద్రమైపోతుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను దుండగులు వివస్త్రను చేస్తారు. తనకు జరిగిన ఆ అన్యాయాన్ని ఎదుర్కొని, వాళ్లను ఎలా మట్టికరిపించి, సమాజంలో మార్పు సాధించింది అన్నదే కథాంశం.