తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలన్​గా వీరు కనిపిస్తే ప్రేక్షకులకు టెర్రర్!

విలన్.. అతడ్ని చూస్తేనే హడల్​.. హీరోయిన్​కు ఫియర్.. గూండాలకు గుండె గుబేల్.. ప్రత్యర్థులకు టెర్రర్.​ సినిమాలో మొదటి నుంచి హీరోకు తలనొప్పిగా మారి చివరి వరకు ప్రేక్షకుల్ని భయపెట్టే ప్రతినాయకుడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొంతమంది విలన్లను ఇప్పుడు చూద్దాం!

విలన్

By

Published : Jul 18, 2019, 5:22 AM IST

Updated : Jul 18, 2019, 12:34 PM IST

సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యమిస్తారో.. విలన్ పాత్రకు అంతే గుర్తింపు ఇస్తారు దర్శకులు. టాలీవుడ్​ నుంచి హాలీవుడ్​ వరకు... పరిశ్రమ ఏదైనా ప్రతినాయకుడు పాత్ర పండితేనే సినిమాలు హిట్టయిన సందర్భాలు అధికం. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్ చిత్రం 'ద లయన్ కింగ్'​లోనూ స్కార్ అనే విలన్ ఉన్నాడు. మోసపూరితంగా సోదరుడిని చంపి అతడి రాజ్యం చేజిక్కించుకునే క్రూరమైన పాత్రను రూపొందించాడు రచయిత.

ఈ సందర్భంగా టాలీవుడ్​ నుంచి హాలీవుడ్​ వరకు సినిమా విలన్లలో భయకరమైనవారిని, ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే ప్రతినాయకుల్ని కొంతమందిని ఇప్పుడు చూద్దాం.

గబ్బర్​సింగ్​..

బాలీవుడ్​లో వచ్చిన 'షోలే' సినిమాలోని గబ్బర్​సింగ్​ను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. తన దైన శైలిలో సంభాషణలు చెప్పే గబ్బర్​.. భయపెట్టే ప్రతినాయకుల్లో ముందు వరుసలో ఉన్నాడు. గబ్బర్​సింగ్ పాత్రను అంజాద్ ఖాన్ పోషించాడు. చంబల్ బందిపోటు దొంగగా తన హావభావాలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాడు. అయితే ఈ పాత్రకు మొదట బాలీవుడ్ నటుడు డ్యానీని అనుకున్నారట దర్శకుడు. అయితే అతడి డేట్లు సర్దుబాటు కాక చివర్లో అంజాద్​ ఖాన్​ను గబ్బర్ పాత్రకు ఎంపికచేశారు.

మొగాంబో...

బాలీవుడ్ చిత్రం 'మిస్టర్ ఇండియా' పేరు ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. అందులో విలన్​గా కనిపించిన అమ్రీష్ పురి.. మొగాంబో పాత్రకు జీవం పోశాడు. భారీ వేషధారణతో క్రూరత్వానికి ప్రతిరూపంగా కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టాడు. తన ఆహార్యం, నటనతో సినీ విమర్శకులను మెప్పించాడు.

లార్డ్ వాల్డ్​​మోర్ట్​..

హ్యారీ పోటర్ సిరీస్​ తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు. ముక్కు లేకుండా తన మాయలతో పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసే వాల్డ్​మోర్ట్​ మిలీయనీల్స్​కు సుపరిచితమే. సైతాన్​కు ప్రతిరూపంగా కనిపించే వాల్డ్​​​మోర్ట్​ జె.కె రౌలింగ్ కలం నుంచి రాలిపడిన భయంకరమైన ప్రతినాయకుడు.

భళ్లాలదేవ..

'బాహుబలి' చిత్రంలో కథానాయకుడికి దీటుగా కనిపించిన పాత్ర ఏదైనా ఉందంటే అది భళ్లాలదేవుడే. ప్రతినాయకుడిగా రానా నటన అద్భుతమనే చెప్పాలి. రాజ్యాధికారం కోసం సొంత తల్లినే చంపడానికి వెనుకాడని యువరాజు పాత్రలో రానా జీవించాడు. కుట్రలు, కుతంత్రాలతో సోదరుడిని మట్టుపెట్టి అతడి భార్యను జీవచ్ఛవంలా చేసే క్రూరుడైన ప్రతినాయకుడిగా మెప్పించాడు.

థానోస్​..

మార్వెల్ కామిక్స్​లో గొప్ప విలన్​గా పేరొందాడు థానోస్. ఒక్క చిటికెతో ప్రజలందరినీ చంపేసే ప్రతినాయకుడి పాత్ర అది. అనుకున్నది సాధించడం కోసం ప్రాణానికి ప్రాణమైన కూతుర్నీ చంపడానికి వెనకాడడు. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'ఎండ్​గేమ్' చిత్రాల్లో కనిపించిన థానోస్ ప్రపంచ ప్రఖ్యాత ప్రతినాయకుల్లో ఒకడిగా నిలిచాడు.

ద జోకర్..

అతడి పేరు జోకర్.. నవ్వుతెప్పిస్తాడు కదా అని అతడితో పెట్టుకుంటే అవుతారు వీకర్. సమస్యలకు సమస్యలు తెప్పించే ట్రబుల్ మేకర్. 'బ్యాట్​మ్యాన్​'కున్న ఎంతో మంది శత్రువుల్లో జోకర్ ముందు వరుసలో ఉంటాడు. నవ్వుతూనే క్రూరంగా చంపడం అతడి స్టైల్. సైకో​లా ప్రవర్తిస్తూ తను అనుకున్నది సాధిస్తుంటాడు. హాలీవుడ్​లో ఈ పాత్రను జాక్ నికోల్సన్, హేత్ లెడ్జర్, జారెడ్ లెటో తదితరులు పోషించారు. వీరందరిలో హేత్ లెడ్జరే(ద డార్క్​నైట్) పాత్రే అందరికీ గుర్తుండిపోతుంది. తన నటనతో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డునూ దక్కించుకున్నాడు. ఈ పురస్కారం లభించిన ఏకైక సూపర్​హీరో పాత్ర జోకరే.

వీరితో పాటు 'ద లయన్ కింగ్' సినిమాలోని స్కార్ గుర్తుండిపోతాడు. సోదరుడు ముఫాసాను మట్టుబెట్టి.. అతడి కుమారుడు సింబాను భయపెట్టి.. రాజ్యాన్ని కొల్లగొట్టి.. ఇతర జీవులను హింసిస్తాడు. 1994లో యానిమేషన్​గా వచ్చిన 'ద లయన్ కింగ్'లో తొలిసారి కనిపించిన స్కార్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'జంగిల్ బుక్' దర్శకుడు రూపొందించిన 'ద లయన్ కింగ్​'లో మరోసారి విలనిజం చూపించనున్నాడు.

లయన్​ కింగ్​లో స్కార్​

ఇది చదవండి: 'శ్రీదేవీకి.. ఆ 'బంగ్లా'కు ఏ సంబంధం లేదు'

Last Updated : Jul 18, 2019, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details