Best Telugu Folk songs: జానపదాలు ఈ ఏడాది జనం నాడి పట్టాయి... ప్రైవేటు పాటలు వీక్షకుల నాలుకలపై నాట్యమాడాయి... అదేసమయంలో కోట్ల వ్యూస్‌తో మేకర్స్‌కు సిరులు కురిపించాయి. అలా ఈ సంవత్సరం అలరించిన టాప్ సాంగ్స్ ఏంటో చూసేద్దాం...
బుల్లెట్టు బండి
Bullet Bandi song: ఈ ఏడాదిలో బుల్లెట్టు బండి పాట వినిపించని తెలుగు గడప లేదంటే అతిశయోక్తి కాదు. కుర్రకారు సెల్‌ఫోన్‌లో, తెలుగింటి పెళ్లి మండపాల్లో, ప్రైవేటు పార్టీల్లో.. ప్రతి చోటా సందడి చేసింది. ప్రతి ఆడపిల్లా ఈ జానపదాన్ని సొంతం చేసుకుంది. అచ్చ తెలుగు పల్లె పడికట్టు పదాలతో షాద్‌నగర్ కుర్రాడు లక్ష్మణ్ రాసిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 18 కోట్ల వ్యూస్ వచ్చాయి. షేక్ బాజీ హృద్యమైన బాణీలు సమకూర్చాడు.
బావల్ల నా బావల్ల
Bavalla na Bavalla song: బావల్లా నా బావల్లా.. ఎంతా సక్కని బావల్లా.. అంటూ అల్లరి పిల్ల శిరీష చేసిన మాయకు తెలుగు జనం బాగానే ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఇంటింటిలో ఇది మార్మోగుతూనే ఉంది. యూట్యూబ్‌లో అయితే రెండున్నర కోట్ల మంది చూశారు. శిరీష ఈ సాంగ్‌లో పాడటమే కాదు.. ఆడింది కూడా. పాట రాసింది, సంగీతం, దర్శకత్వం.. అన్నీ తిరుపతి మాట్లనే. తిరుపతి గతంలోనూ రాసిన ఫోక్‌సాంగ్స్ ఎన్నో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి.
గున్న గున్న మావిళ్లల్ల..
Gunna Gunna mavillalla song: అచ్చతెలుగు జనపదానికి ఊపైన స్టెప్పులద్ది పాటను వీడియోగా తీస్తే ఏమవుతుంది? రెండు కోట్ల వ్యూస్ వస్తాయి! గున్నా గున్నా మావిళ్లల్ల అదే జరిగింది. చంద్రప్రకాశ్ రాసిన లిరిక్స్‌కు సింగర్ తేజస్విని హుషారైన గొంతు తోడవడం వల్ల జనం ఈ పాటను తమ ఫేవరిట్ లిస్ట్‌లో చేర్చుకున్నారు. గజ్వేల్ వేణు ఊపైన బాణీలు అందించాడు. వీరందరితో పోటీ పడుతూ పాటలో నటించిన మౌనిక, సందీప్‌లు డ్యాన్స్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టారు.
వెళ్లురా ఓ మనిషి వెళ్లురా..
Vellura O manishi vellura song: నువ్వు కట్టుకున్న బంగుళా దాసుకున్న పైసలు.. ఏవి రావురో.. నీ వెంట రావురో.. జీవిత సారాన్నంతా ఒక్కపాటలో రంగరించి చెప్పినట్టుగా ఉంది కదూ! అందుకే ఈ సాంగ్ జనాలకి బాగా నచ్చేసింది. రాసింది, పాడింది.. బాలు కె.అసుర. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కళ్లకింపుగా చిత్రీకరించింది అరవింద్ కొణతం. చిన్నచిన్న వాడుక పదాలతో అల్లిన ఈ సాంగ్ పల్లె, పట్టణం తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో కోటి మందికి పైగా వీక్షించారు.
ఉంగురమే
ఊరెనక దున్నిచ్చి.. ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రాంలాల టుంగూరమే.. అంటూ మామిడి మౌనిక హుషారుగా పాడితే జనం పాదాలు కదలకుండా ఉంటాయా? విడుదలైన మూడు నెలల్లోనే రెండున్నర కోట్ల వ్యూస్ మూటగట్టుకుంది ఈ పాట. నాగదుర్గ అందం, అభినయం, నృత్యం ఈ జానపదానికి ప్లస్‌గా మారింది. తెరకెక్కించింది ఎస్‌వీ మల్లిక్‌తేజ. ప్రస్తుతానికి టాప్ లిస్టుతోపాటు ట్రెండింగ్‌లో ఉంది ఈ జానపదం.
ఇదీ చూడండి: 'బంగార్రాజు' వెనక్కి తగ్గుతాడా?.. రిలీజ్‌పై టెన్షన్