తెలంగాణ

telangana

ETV Bharat / sitara

fathers day: సినిమాల్లో నాన్నంటే గుర్తొచ్చేది వీళ్లే! - బొమ్మరిల్లు

'ఫాదర్స్ డే'(fathers day) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు 'తండ్రి'కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన మనసుల్లో చెరగని ముద్రవేసిన వెండితెర 'నాన్న'లను ఓసారి గుర్తు చేసుకుందాం.

fathers day
ఫాదర్స్​ డే

By

Published : Jun 20, 2021, 5:41 AM IST

నాన్న అంటే బాధ్యత, ప్రేమ, క్రమశిక్షణ, ధైర్యం, రక్షణ, నమ్మకం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే. నాన్న తిట్టినా, కొట్టినా మనమంచి కోసమే. మన ఎదుగులలో తోడ్పాటును అందిస్తారు. సరైన మార్గం చూపిస్తారు. కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపిస్తారు. అయితే 'ఫాదర్స్ డే' (fathers day) ఒక్కరోజు ఆయన్ని గుర్తుచేసుకుని తక్కువ చేయలేం. ఎందుకంటే మన జీవితంలోని ప్రతి క్షణం ఆయన ఇచ్చిన వరమే. నిజజీవితంలోనే కాకుండా వెండితెరపైనా ఇలా అన్ని వేరియేషన్స్​ను చూపించిన కొన్ని నాన్న పాత్రలు, మన తెలుగు సినిమాల్లోనూ ఉన్నాయి. తండ్రులంటే ఇలానే ఉంటారేమో అనిపించేంతలా వాటిలో నటించారు... కాదు కాదు జీవించారు.

బొమ్మరిల్లు(2006)

'బొమ్మరిల్లు ఫాదర్'.. ఈ ఒక్క పదం చాలు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఈ సినిమాలోని నాన్న పాత్రను ప్రేక్షకులు ఆదరించారు. తండ్రిగా ప్రకాశ్​రాజ్, కుమారుడిగా సిద్దార్థ్ కనబరిచిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అయితే 'బొమ్మరిల్లు'ను తన స్నేహితుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు దర్శకుడు భాస్కర్, గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

నాన్నకు ప్రేమతో(2016)

'నాన్న.. నన్ను వెంటాడే ఓ ఎమోషన్​' అంటూ తండ్రి కొడుకుల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు దర్శకుడు సుకుమార్. రాజేంద్రప్రసాద్- జూ.ఎన్టీఆర్.. వారి వారి పాత్రల్ని అద్భుతంగా పోషించారు. తమ తండ్రిని ఆర్థికంగా, మానసికంగా మోసం చేసిన ప్రతినాయకుడ్ని.. ఆయన ముగ్గురు కొడుకులు ఏ విధంగా మట్టుబెట్టారు అనేది చిత్ర కథాంశం.

సన్నాఫ్ సత్యమూర్తి(2015)

తండ్రి మరణానంతరం, ఓ సంఘటన వల్ల ఆస్తి మొత్తం కోల్పోయిన కొడుకు.. ఆ తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు. నాన్నపై పడిన అపవాదుల్ని ఎలా రూపుమాపాడు. చివరగా ఆయన్ను అందరూ మంచి అనేలా ఏం చేశాడు అనేదే 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా. ఉన్నది కొంతసేపే అయినా, తన నటన చాతుర్యంతో నాన్నగా మనసు దోచారు ప్రకాశ్​రాజ్. కుమారుడి పాత్రలో అల్లుఅర్జున్ అద్భుత నటన కనబరిచారు. దీనికి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(2007)

మధ్యతరగతి కుటుంబంలో తండ్రి-కొడుకులు అంటే ఎలా ఉంటారో కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'. వారి పాత్రల్లో కోట శ్రీనివాసరావు-వెంకటేశ్.. మనల్ని నవ్వించారు, ఏడిపించారు, ఎమోషన్ తెప్పించారు. చివరకు ఓ అద్భుతమైన సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చారు. సెల్వరాఘవన్ దీనికి దర్శకుడు.

నువ్వునాకు నచ్చావ్(2001)

పేరుకే రొమాంటిక్ కామెడీ సినిమా అయినా ఇందులో తండ్రి కొడుకు, నాన్న-కూతురు మధ్య ఉండే ఎంతో చక్కగా చూపించారు. వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా సరే ఇప్పుడు చూసిన మీ ముఖంపై నవ్వు తెప్పిస్తుందీ చిత్రం. ప్రకాశ్​రాజ్, చంద్రమోహన్​.. బిడ్డల బాగు కోసం తపన పడే తండ్రి పాత్రల్లో జీవించేశారు.

వీటితో పాటే 7/జీ బృందావన కాలనీ, కొత్త బంగారు లోకం, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, సుస్వాగతం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, రఘువరన్ బీటెక్​ సినిమాల్లోని తండ్రి పాత్రలూ.. మన మనసుల్లో చోటు సంపాదించాయి.

ఇదీ చూడండి:మీ సూపర్​ హీరో కోసం ఏం సిద్ధం చేస్తున్నారు?

ABOUT THE AUTHOR

...view details