'అల్లుడు శీను'తో కథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు బెల్లకొండ సాయిశ్రీనివాస్. మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్.. ఆ తర్వాత 'సాక్ష్యం', 'జయ జానకి నాయక' లాంటి కుటుంబకథా చిత్రాలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు. శ్రీనివాస్ నటించిన చిత్రాలు హిందీలో డబ్ కావడం వల్ల ముంబయిలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో అక్కడి ప్రేక్షకులనూ అలరించాలనే ఉద్దేశంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'ఛత్రపతి' చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
"నేను ఇప్పటివరకూ ఏడు సినిమాల్లో నటించా. వాటిల్లో ఆరు చిత్రాలు(హిందీ డబ్బింగ్ వెర్షన్) యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ నాకు సరిపడే స్ర్కిప్ట్ దొరకలేదు. 'ఛత్రపతి' కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్ వెర్షన్‌లో ప్రభాస్ పోషించిన పాత్రను రీక్రియేట్ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్ చిత్రాన్ని వీక్షించలేదు"