మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 13న 'ఆర్‌ఆర్‌ఆర్'ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రతిష్ఠాత్మక సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పినట్లైంది.
ఆ రోజే ఎందుకంటే..!
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ రెండుసార్లు సినిమా విడుదల వాయిదా పడింది. తొలుత ప్రకటించిన తేదీ ప్రకారం గతేడాది జులై 30న సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా 'ఆర్‌ఆర్‌ఆర్'తో సహా అన్ని సినిమాల షూటింగ్‌లు, విడుదల తేదీలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్'ను సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఈ చిత్రంలో నటిస్తున్న ఐరిష్ నటి అలీసన్ డూడీ అక్టోబరు 8న 'ఆర్‌ఆర్‌ఆర్' అంటూ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసింది. దీంతో సినిమా విడుదల తేదీ దాదాపు ఖరారు అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చిత్ర బృందం సినిమాను అక్టోబరు 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
'బాహుబలి' తర్వాత రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయ క్రేజ్ ఏర్పడింది. చైనా, జపాన్ సహా పలు దేశాల్లో ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో సినిమాను విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలీసన్ డూడీ చెప్పినట్లు అక్టోబరు 8న సినిమా విడుదల చేస్తే 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బాండ్ 'నో టైమ్ టు డై'తో పోటీ పడాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా విడుదల తేదీని మరో నాలుగు రోజులు పొడిగించారు. దీంతో థియేటర్ల విషయంలో రెండు సినిమాలకు వెసులుబాటు లభించినట్లవుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి భారీ ప్రాజెక్టు విడుదల తేదీ ముందుగా ప్రకటించడం కూడా ఒక విధంగా మంచిదే. దసరా సమయానికి మరో చిత్రం పోటీ పడకుండా కాస్త అటూ ఇటూ తేదీలు మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది. మిగిలిన సినిమా మేకర్స్ కూడా అందుకు అనుగుణంగా షెడ్యూల్స్ మార్చుకుంటారు. అంతేకాదు, అప్పటికి కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో థియేటర్‌కు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది.