తొలి చిత్రం 'కార్తికేయ'తోనే వినూత్న కథని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు చందూ మొండేటి. నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే దానికి కొనసాగింపుగా 'కార్తికేయ 2' రాబోతుంది. 'కార్తికేయ' చిత్రం ఎంతగా అలరించిందో 'కార్తికేయ 2' కాన్సెప్ట్ వీడియో అంతకు మించి దూసుకెళ్లింది.
'ఆర్య' వల్ల దర్శకుడ్ని అయ్యా!
తొలి సినిమా 'కార్తికేయ'తోనే ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు చందూ మొండేటి. ఆ తర్వాత 'ప్రేమమ్' రీమేక్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం 'కార్తికేయ 2'ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇతడు సినీ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం 'ఆర్య' సినిమానట.
థ్రిల్లర్ సస్పెన్స్ మాత్రమే కాదు ప్రేమ కథల్ని కూడా ఆవిష్కరించి ఫిదా చేశాడు చందు. మలయాళ చిత్రం 'ప్రేమమ్'ని రీమేక్‌లా కాకుండా తనదైన శైలిలో చూపించాడు. మరి చందుకి అసలు దర్శకుడు అవ్వాలనే కోరిక ఎప్పుడు కలిగింది. స్ఫూర్తి ఏంటో? తెలుసుకుందాం.
అది 2004. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'ఆర్య' విడుదలైంది. మరుసటి రోజు చందు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాడు. అక్కడ టిఫిన్ కన్నా వేడి వేడిగా 'ఆర్య' సంగతులు వినిపించాయి. "సుకుమార్ కొత్తోడే అయినా ఏం తీశాడు రా సినిమా. ప్రేమ కథని భలే చూపించాడు" అంటూ సుక్కుని పొగిడేస్తున్నారు సినిమా చూసొచ్చిన వాళ్లు. మరో చోటుకి వెళ్తే అక్కడా ఇదే చర్చ. "ఓ సినిమా ప్రేక్షకులకి నచ్చితే దర్శకుడ్ని ఇంతగా ఆకాశానికి ఎత్తేస్తారా" అనే భావన కలిగింది చందుకి. నా గురించి ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనా రేకెత్తింది. అప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసిన చందు 'ఆర్య' స్ఫూర్తితో అలా సినిమాల వైపు... దర్శకత్వం వైపు అడుగులు వేశాడు.