"కెమెరా ముందున్నంత వరకే నేను నటిని.. ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టానంటే పక్కింటి అమ్మాయిలాగే గడిపేస్తుంటా" అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. 'అ..ఆ..'తో తెలుగు తెరపైకి అడుగుపెట్టిన ఈ మలయాళ భామ.. అతి తక్కువ సమయంలోనే విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయింది. అల్లరి పిల్లలా సరదా పాత్రలతో మెప్పిస్తూ అలరించింది. మరి 'సెట్లో ఎంతో ఉత్సాహంగా సందడి చేస్తూ కనిపించే అనుపమ.. చిత్రీకరణలు లేనప్పుడు ఇంట్లో ఎలా ఉంటుంది?' అని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది.
అలా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతా: అనుపమ
అందమంటే పైపై మెరుగులు కాదని.. లోపల మనసు ప్రశాంతంగా ఉండాలని అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. చిత్రీకరణలు లేనప్పుడు మేకప్‌కు దూరంగా ఇంటికే పరిమితమవుతానని చెబుతోంది. కానీ, ఇంట్లో ఉంటే మాత్రం రకరకాల హెయిర్‌స్టైల్ ప్రయోగాలు చేస్తానని వెల్లడించింది.
"షూటింగ్‌లు లేకపోతే ఇల్లే నాలోకంగా మారిపోతుంటుంది. అసలు మేకప్ జోలికి పోను. రకరకాల హెయిర్ స్టైల్స్‌తో ప్రయోగాలు చేస్తుంటా. చాలా మంది 'ఇంట్లో ఉన్నప్పుడు అందం కోసం మీరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు' అని అడుగుతుంటారు. వాస్తవానికి నేనెలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోను. నా దృష్టిలో అందమంటే పైపై మెరుగులు కాదు. లోపల మనసు ప్రశాంతంగా ఉండాలి. నేను నన్నిలా ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతా" అని చెప్పింది అనుపమ.
తెలుగులో చివరిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'రాక్షసుడు' చిత్రంలో నటించిన అనుపమ.. ప్రస్తుతం తమిళంలో రూపొందుతున్న 'తల్లి పొగతే' చిత్రంలో నటిస్తోంది.