తెలంగాణ

telangana

ETV Bharat / sitara

277ఏళ్ల సినిమా..86 వేల కోట్లు - బ్యూటీ అండ్​ ద బీస్ట్​

1740లో ఓ రచయిత్రి రాసిన కథ.. 2017లో సినిమాగా  తీశారు. ఆ చిత్ర వసూళ్లు అక్షరాలా 86వేల కోట్ల పైమాటే. కథ 277 ఏళ్ల పాతదైనా.. ప్రేక్షకుల మన్ననలు పొందింది.  డిస్నీ సంస్థ తెరకెక్కించిన ఆ చిత్రమే ‘బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’.

బ్యూటీ అండ్​ ది బీస్ట్

By

Published : Mar 17, 2019, 3:49 PM IST

పాటలు, నృత్యాలు, అద్భుత సాంకేతికతతో రూపొందిన మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ చిత్రం ‘బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’ (2017). బిల్‌ కాన్డన్‌ దర్శకత్వం వహించారు. అందాల తార ఎమ్మా వాట్సన్, డేనియల్‌ స్టీవెన్, ల్యూక్‌ ఎవాన్స్‌ తదితరులు ఇందులో నటించారు.

1991 బ్యూటీ అండ్​ ది బీస్ట్ చిత్రం
  • పేదమ్మాయి ఆలోచన:

'బ్యూటీ అండ్​ ద బీస్ట్​' కథను 1740లో గాబ్రియెల్ సుజానే బార్బోట్​ డీ విల్లెన్యువే అనే ఫ్రెంచి రచయిత్రి రాసింది. ఇందులోని సారాంశాన్ని కుదించి 1756లో కొత్త వెర్షన్​లో రాసింది జియానే మేరీ లేప్రిన్స్‌ డెబ్యూమాంట్‌. ఈమె పదకొండేళ్లకే తల్లిని కోల్పోయిన అమ్మాయి. ఓ ధనవంతురాలి సాయంతో చదువుకుని తన రచనలతో ఎందరినో మెప్పించింది.

గాబ్రియెల్ సుజన్నె-జియానే మేరీ

ఈ కొత్త కథనే వాల్ట్‌డిస్నీ సంస్థ 1991లోనే ఓ యానిమేషన్‌ సినిమాగా తీసింది. 172 కోట్ల రూపాయలతో తీయగా అప్పట్లోనే 2వేల 930 కోట్ల వసూళ్లు కురిపించి సంచలనం సృష్టించింది. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి అవార్డులనూ గెలుచుకుంది.

మళ్లీ ఇదే కథాంశంతో సాంకేతికత జోడించి 2017లో లైవ్​ యాక్షన్​ సినిమాగా తెరకెక్కిస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 26 సంవత్సరాల కాలంలో ఆ కథ రేంజ్​ 2వేల కోట్ల నుంచి 86వేల కోట్లకు పెరిగిపోయిందంటే ఎంత క్రేజ్ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

  • ఇంతకీ ఆ కథేంటి:

అనగనగా ఓ రాకుమారుడు. అతడికి అహంకారం ఎక్కువ. ఓ తుపాను నాటి రాత్రి ఓ దేవకన్య బిచ్చగత్తె రూపంలో వస్తుంది. ఆ రాత్రి ఇంట్లో తలదాచుకోనివ్వమని కోరుతూ ఓ గులాబీని కానుకగా ఇవ్వబోతుంది. ఆ రాకుమారుడు పొగరుతో ఆమెను బయటకి గెంటిస్తాడు. అప్పుడు దేవకన్య తన నిజరూపాన్ని చూపించి శపిస్తుంది. ఫలితంగా అతడు ఓ వికృత రూపం గల రాక్షసుడిగా మారతాడు.
ఆ కోటలోని సేవకులంతా రకరకాల వస్తువులుగా మారిపోతారు. మరి శాప విమోచనం ఏమిటి? ఆ రాక్షసుడు ఓ అందమైన అమ్మాయి మనసు గెలుచుకోవాలి. ఆమె ప్రేమతో అతడికి ఓ ముద్దు పెట్టాలి. ఇదంతా ఆ పెరట్లో ఓ అందమైన గులాబీ పువ్వు ఆఖరి రేకు రాలి పడిపోయేలోగా జరగాలి. లేకపోతే అతడు ఎప్పటికీ రాక్షసుడిగానే మిగిలిపోతాడు. ఏళ్లు గడుస్తున్నాయి. ఒక్కో ఏడాది ఒక్కో గులాబీ రేకు పడిపోతుంటుంది. ఇక ఆఖరికి ఒకే ఒక రేకు మిగిలింది. అప్పుడా కోటలోకి ఓ వ్యక్తి వచ్చి, తన కూతురు కోసం ఓ గులాబీని కోసుకుంటాడు. ఆ రాక్షసుడు కోపంతో అతడిని బంధిస్తాడు. తండ్రిని విడిపించడం కోసం అతడి కూతురు ఆ కోటలోకి వస్తుంది. ఆ అమ్మాయిని మంచి చేసుకోడానికి ప్రయత్నించిన రాక్షసుడికి చివరికి శాపవిమోచనం కలిగిందా.? అతడి వికృత రూపాన్ని చూసి భయపడకుండా అతడిని ప్రేమించిందా? అనేదే కథ.

  1. ఈ సినిమాలో బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ సన్నివేశంలో కథానాయిక ఎమ్మా వాట్సన్‌ కోసం ప్రత్యేకమైన గౌను కుట్టించారు. ఈ దుస్తులను తయారు చేయడానికి 3,000 అడుగుల దారం అవసరమైంది. సుమారు 12వేల పనిగంటలు సమయం పట్టింది. ఆ గౌను మీద 2,160 క్రిస్టల్స్‌ను కుట్టారు.

ABOUT THE AUTHOR

...view details