Bangararaju music director Anup rubens: సినిమా చూడాలనే ఆసక్తిని పెంచడంలో ఇటీవల పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఇప్పుడున్న ట్రెండ్‌తో పాటలు మరింతగా ప్రేక్షకులకు చేరువవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అటు స్టార్ కథా నాయకుల చిత్రాలకీ... ఇటు నవతరం సినిమాలకీ స్వరాలు సమకూరుస్తూ విజయాలు అందుకుంటున్నారు అనూప్. నాగార్జున కథా నాయకుడిగా నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' తర్వాత... ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన 'బంగార్రాజు'కి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనూప్ విలేకర్లతో ముచ్చటించారు.
"నాగార్జున పాడితే ఎలా ఉంటుందనేది నాకు 'మనం' సమయంలో ఆ సినిమా సెట్లోనే బాగా అర్థమైంది. పియోరే... పాటను లొకేషన్‌లో సరదాగా పాడారు. ఆ వాయిస్ బాగా నచ్చి, మీరొక పాట పాడాలని అప్పుడే చెప్పా. 'సోగ్గాడే చిన్నినాయనా'కి వచ్చేసరికి డిక్కడిక్క డుం డుం... అనే లైన్స్‌ని ఆయనతో పాడించాం. ప్రేక్షకులకు అది బాగా నచ్చింది. 'బంగార్రాజు'లో ఆయన పాడే సందర్భం కుదిరింది. ఆ పాత్ర, సందర్భం పరంగా ఆయన మొదట కొన్ని లైన్లు పాడితే సరిపోతుందని నేను, దర్శకుడు కల్యాణ్ వెళ్లి అడిగాం. మొత్తం బాణీ విన్నాక ఆయనే పాడటానికి ముందుకొచ్చారు. అలా మొత్తం పాటనిు పాడారు. సంగీతానికి మొట్ట మొదటి ప్రేరణ కథే".
"సామాజిక అనుసంధాన వేదికల ప్రభావం మొదలయ్యాక సినిమా సంగీతం ఓ కొత్త ట్రెండ్‌ను చూస్తోంది. ఒకొక్క పాట ఒక్కో సారి విడుదలవుతూ ప్రేక్షకులకు మరింతగా చేరువవుతోంది. ఈ ట్రెండ్ ఓ మంచి పరిణామం. ఇదివరకు సీడీలు పెట్టుకుని మొత్తం పాటల్ని వినేవారు. ఇప్పుడు ఒకొక్క పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ, వాటిని ఆస్వాదిస్తున్నారు. ప్రతీ పాట శ్రోతను ఏదో ఒక సందర్భంలో స్పృశిస్తూ సినిమాను చూడాలనే ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ‘శేఖర్’ సినిమాకి సంగీతం అందిస్తున్నా. మంచి కథ అది. పాటలతోపాటు, నేపథ్య సంగీతానికి ప్రాధాన్యం ఉంది. విక్రమ్ కె.కుమార్‌తోనూ సినిమా ఉంటుంది. మరికొన్ని త్వరలోనే ప్రకటిస్తా".
"నాగార్జునతో పనిచేయడం ఎప్పుడూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేనే కాదు... ఆయనతో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడి అభిప్రాయం అదే. పని విషయంలో ఆయన స్వేచ్ఛనిస్తారు. దాంతో అవతలివాళ్లలో ఇంకాస్త బాధ్యత పెరుగుతుంది. నాగార్జునతో ఇదివరకు నేను చేసిన సినిమాలు విజయవంతమయ్యాయి. అదీ నాపై మరింత బాధ్యతను పెంచే విషయమే. నా దృష్టిలో ఏ సినిమాకైనా పడే కష్టం ఒక్కటే. కొన్ని కలయికల్లో పనిచేస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు. మన సొంత సంస్థలో పనిచేస్తున్నామనే అభిప్రాయం కలుగుతుంది. మనకు ఏం కావాలో వాళ్లకి తెలుసు, వాళ్లు మన నుంచి ఏం కోరుకుంటున్నారో మనకు తెలుసు. నాగార్జున సర్‌తో పనిచేసేటప్పుడు మామధ్య అలాంటి వాతావరణమే కనిపిస్తుంటుంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఘన విజయం సాధించిన చిత్రం. దానికి కొనసాగింపుగా వస్తున్న ‘బంగార్రాజు’కి సంగీతం అనగానే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలకి తగ్గట్టే సమష్టిగా పనిచేశాం".
"కొనసాగింపు చిత్రం అనగానే పోల్చి చూడటాలు మొదలవుతాయి. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి పని చేయాల్సి ఉంటుంది. నాగార్జున అంటే మనకు ఓ బెంచ్ మార్క్ ఉంది, దాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని చెప్పేవారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ అదే స్థాయిలో కష్టపడుతూ, ఇతర బృందాన్ని నడిపించారు. ఈ సినిమా ఓ గ్రామీణ కథతో తెరకెక్కింది. అందుకు తగ్గట్టే సంగీతం అందించాం. ప్రతీ పాటకీ చాలా తక్కువగా పాశ్చాత్య వాయిద్య పరికరాల్ని వినియోగిస్తూ, సహజమైన వాయిద్యాలతో సంగీతం అందించే ప్రయత్నం చేశాం. అది స్వచ్ఛమైన పల్లెటూరి అనుభూతిని కలిగించేందుకు దోహదం చేసింది. నేపథ్య సంగీతమూ ఎంతో ఆహ్లాదాన్ని పంచేలా ఉంటుంది. ఇప్పటికే మూడు పాటల్ని విడుదల చేశాం. లడ్డుండా... పాట శ్రోతలకి ఎంతగానో చేరువైంది. నా కోసం..., తస్సాదియ్యా... పాటలూ చాలా ఆదరణ పొందాయి. మరో మూడు పాటలు వస్తాయి. సహజంగా పెద్ద సినిమాలకి పని చేస్తున్నప్పుడు ఎక్కువ రోజుల సమయం తీసుకుంటాం. దీనికోసం రోజుకి 12 గంటలకు బదులుగా 20 గంటలు పనిచేశాం. సాంకేతిక బృందంలో అందరూ అదే తరహాలో పనిచేశారు. అందుకే అనుకున్న సమయంలో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది".
ఇదీ చూడండి:బ్లాక్ చీరలో నిధి బ్లాక్‌బస్టర్ పోజులు!