తనకు రెండోసారి కరోనా వచ్చినప్పుడు, ఒక్కరోజు ఆస్పత్రిలో చేరడం ఆలస్యమైతే చనిపోయేవాడినని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ అసలు మెగా ఫ్యామిలీ అంటేనే తనకు ఎంతో గౌరవమని తెలిపారు. పవన్ కల్యాణ్ తనకు జీవితాన్ని ఇస్తే, చిరంజీవి తన ప్రాణాన్ని కాపాడారని తెలిపారు.
"రెండోసారి కరోనా వచ్చినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యా. కనీసం మాట కూడా సరిగా రాలేదు. ఏ ఆస్పత్రికి ఫోన్ చేసినా బెడ్స్ లేవని చెప్పారు. ఆ సమయంలో మా ఇంటిల్లిపాదీ కరోనాతో బాధపడుతున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. మా బాస్‌కు ఫోన్ చేద్దామంటే ఆయనకు కూడా అప్పుడే కరోనా వచ్చింది. ఏం చేయాలో తెలియక చిరంజీవిగారికి ఫోన్ చేశా. 'ఏంటి గణేశ్' అన్నారు. 'అన్నా ఇదీ పరిస్థితి' అని చెప్పా. వెంటనే అటు నుంచి మాట ఆగిపోయింది. ఫోన్ కట్ అయింది. రెండు నిమిషాల తర్వాత మళ్లీ ఆయనే ఫోన్ చేశారు. 'గణేశ్ అపోలోకి వెళ్లు. నేను చెప్పాను' అన్నారు. ఆస్పత్రికి వెళ్తే, అప్పటికే 10మంది డాక్టర్లు నాకోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షలు చేస్తే 80శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని రిపోర్ట్ వచ్చింది. వెంటనే రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇచ్చారు. మూడు రోజులు ఐసీయూలో ఉన్నా. 'ఒక్క రోజు ఆలస్యమైతే చనిపోయేవాళ్లు సర్' అని డాక్టర్లు చెప్పారు. ఇది తెలిసిన చిరంజీవి 'అంత తీవ్రంగా కరోనా వచ్చే వరకూ ఎందుకు ఆస్పత్రికి వెళ్లలేదు' అని తిట్టారు. అలాంటి వ్యక్తికి జీవితాంతం రుణపడి ఉంటాను."