బుల్లితెర ధారవాహిక 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ సహాయ దర్శకుడు రామ్ వృక్ష గౌర్.. కూరగాయలు విక్రయిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా చిత్రీకరణలకు బ్రేక్ పడటం వల్ల స్వగ్రామంలో ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు.
"నేను ఓ సినిమా తర్వాత విరామంలో అజంఘర్ వచ్చాను. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాను. తిరిగి వెళ్లడం కుదరలేదు. మేం చేస్తున్న ప్రాజెక్టు ప్రస్తుతం ఆగిపోయింది. అది తిరిగి ప్రారంభం కావడానికి మరో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చని నిర్మాత చెప్పారు. ఈ విరామంలో నా తండ్రి వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. కూరగాయలు అమ్మడం ప్రారంభించాను. నాకు వ్యాపారం తెలుసు బాగా తెలుసు. ఇందులో విచారించాల్సింది ఏమీ లేదు"
- రామ్ వృక్ష్ గౌర్, సహాయ దర్శకుడు
"2002లో నా స్నేహితుడు, రచయిత షహనావాజ్ ఖాన్ సహాయంతో ముంబయి వెళ్లాను. తొలుత లైటింగ్ విభాగంలో చేరి.. ఆ తర్వాత టీవీ సీరియల్స్ నిర్మాణంలో పనిచేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాక అనేక సీరియల్స్ నిర్మాణంలో.. చిన్నారి పెళ్లికూతురు ఎపిసోడ్ డైరెక్టర్, యూనిట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. నాకు ముంబయిలో సొంత ఇల్లు ఉంది. పరిస్థితులు సద్దుమణిగే వరకు నేను చేయగలిగింది చేస్తున్నాను" అని రామ్ వృక్ష్ గౌర్ వెల్లడించారు.
మిలింద్ గునాజీ, రాజ్‌పాల్ యాదవ్, రణదీప్ హుడా, సునీల్ శెట్టి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ రామ్ వృక్ష్ పనిచేశారు. కరోనా ప్రారంభానికి ముందు భోజ్‌పురి, హిందీ చిత్రాల్లో పనిచేయడానికి సిద్ధమవగా.. అంతలోనే లాక్డౌన్ విధించారు.