తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆదిత్య 999'తో బాలయ్య సాహసం..! - aditya 369

నందమూరి నటసింహం బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుల కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్ 'ఆదిత్య 369'. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు బాలయ్య.

balayya
బాలకృష్ణ

By

Published : Dec 20, 2019, 6:16 AM IST

Updated : Dec 20, 2019, 8:17 AM IST

తెలుగు చలన చిత్ర చరిత్రలో 'ఆదిత్య 369'కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. నందమూరి బాలకృష్ణ-సింగీతం శ్రీనివాసరావుల కలయికలో వచ్చిన ఈ టైమ్​ మిషన్‌ కథాంశానికి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు కూడా ఈ చిత్రం బుల్లితెరపై వస్తుందంటే నేటితరం సినీప్రియులు టీవీలకు అతుక్కుపోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడీ సినిమాకు బాలకృష్ణ సీక్వెల్‌ చేయబోతున్నట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

'ఆదిత్య 999' పేరుతో ఈ సీక్వెల్‌ తెరకెక్కబోతున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. నిజానికి బాలయ్య వందో చిత్రం ఇదే అవుతుందని అప్పట్లో తెగ చెప్పుకున్నారు. కానీ, ఆఖరుకు అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఈ సీక్వెల్‌కు బాలకృష్ణనే స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడట. ఇది ఎంత వరకు వాస్తవమన్నది ఇప్పుడే కచ్చితంగా తెలియనప్పటికీ బాలయ్యకు తన తండ్రి ఎన్టీఆర్‌లా మెగాఫోన్‌ చేతబట్టాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నది వాస్తవం.

అప్పట్లో 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్నాక.. ఓ దశలో మరో దర్శకుడెవరూ దొరక్కపోతే తానే ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు బాలయ్య. కానీ, క్రిష్‌ రాకతో ఆ బాధ్యత చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ, ఇప్పుడు మాత్రం 'ఆదిత్య 999'తో నందమూరి నటసింహం తన దర్శకత్వ ప్రతిభ చూపించే అవకాశముందని తెలుస్తోంది. మరి నిజంగా బాలయ్య ఈ సాహసం చేస్తాడా? అసలీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశముందా? అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

ప్రస్తుతానికి బాలయ్య 'రూలర్‌'గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ చిత్ర హడావుడి పూర్తయిన వెంటనే ఈ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీని తర్వాత పట్టాలెక్కబోయే ప్రాజెక్టు 'ఆదిత్య 999' అవుతుంది.

ఇవీ చూడండి.. 'అది జీవితంలో చేయలేను.. చూస్తా అంతే'

Last Updated : Dec 20, 2019, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details