నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరి కలయికలో వచ్చిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్' బంపర్ హిట్ సినిమా. ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ చిత్రం నమోదు చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది చిత్రీకరణకు రావడానికి బాలకృష్ణ ఓ కండిషన్ పెట్టారంటే నమ్ముతారా. అదేంటి బాలయ్య దర్శకుల హీరో కదా.. అలాంటి ఇబ్బందులేం పెట్టడంటారే అనుకుంటున్నారా? ఆ షరతు ఏంటో తెలిస్తే బాలకృష్ణ నటన మీద ఉన్న ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. అది ఆ సినిమా హిట్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది కూడా.
పోలీసు నేపథ్య సినిమాల్లో 'రౌడీ ఇన్‌స్పెక్టర్' ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే.. బాలయ్య నటన చూసి ప్రేక్షకులు అదుర్స్ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు.. జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోయారు. అలానే షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్ ఓ సందర్భంలో చెప్పారు.