నందమూరి బాలకృష్ణ.. అర్జునుడిగా నటించి, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల'. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. 64 సెక్లన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
పాండవులు అజ్ఞాతవాసం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలని మునులు ఇచ్చిన ఆశీర్వచనంతో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఊర్వశి ఇచ్చిన శాపం నా పాలిట వరం అయినది. మన దాయాదులు ఎంతమంది వేగులను పంపినను వాళ్ల పాచికలు పారవు, ఎత్తుగడలు సాగవు' అని అర్జునుడి పాత్రధారి బాలయ్య చెప్పిన డైలాగ్ మెప్పిస్తోంది. చివరగా ఋషులను ఉద్దేశిస్తూ.. ద్రౌపది సమేత పాండుకుమారుల తరఫున ఇదే నమ సుమాంజలిలు అంటూ ట్రైలర్‌ను ముగించారు.
సౌందర్య ద్రౌపదిగా, భీముడిగా శ్రీహరి నటించిన ఈ సినిమాను రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన పర్ణశాల సెట్లో 2004 మార్చి 1న ప్రారంభించారు. 17 నిమిషాల వ్యవధి ఉన్న సన్నివేశాల షూటింగ్ పూర్తిచేశారు. అనంతరం కొన్నాళ్లకు సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వల్ల చిత్రీకరణ మధ్యలోనే నిలిచిపోయింది. ఆమెలాంటి నటి మళ్లీ దొరికితే సినిమాను పూర్తి చేస్తానని బాలయ్య చాలాసార్లు చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ఎట్టకేలకు ఇప్పుడు దసరా కానుకగా అక్టోబరు 24న ఉదయం 11:29 గంటలకు 'నర్తనశాల'ను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. శ్రేయస్ ఈటీ యాప్‌లో లాగిన్ అయి రూ.50 చెల్లించి, ఈ సినిమాను వీక్షించొచ్చు.