పౌరాణిక, జానపద చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే అతికొద్దిమంది నటుల్లో అలనాటి నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తనయుడు బాలకృష్ణ కూడా ఈ జానర్ సినిమాల్లో అందెవేసిన చేయి. సుదీర్ఘ సంభాషణలను కూడా అలవోకగా చెప్పేస్తారు బాలయ్య. దసరా పండగ రోజు ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వన్నట్లు ప్రకటించారు. ఆయన కీలక పాత్రల్లో, స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం 'నర్తనశాల'. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన షూటింగ్ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నేడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్‌లుక్ వచ్చేసింది - బాలకృష్ణ నర్తనశాల
నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 'నర్తనశాల'. ఈ సినిమా షూటింగ్‌ను అప్పట్లో ప్రారంభించినా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు బాలయ్య. దసరా కానుకగా 17 నిమిషాల వీడియోను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా నేడు ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
బాలకృష్ణ, సౌందర్య, శరత్‌బాబు, శ్రీహరి తదితరులు కీలక పాత్రల్లో ఈ సినిమా ప్రారంభమైంది. మహాభారతంలోని 'నర్తనశాల' ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించాలన్నది బాలయ్య ఆకాంక్ష. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు నటించారు. కొంత చిత్రీకరణ పూర్తయిన తర్వాత ద్రౌపది పాత్రధారి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడం వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని బాలకృష్ణ అనేక వేదికలపై చెప్పారు. అయితే సౌందర్య లాంటి అద్భుత నటి దొరికినప్పుడే చిత్రం పట్టాలెక్కుతుందన్నారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అసలు ఈ సినిమా మళ్లీ చిత్రీకరణ జరుపుకొంటుందా? అన్న సందేహాల నేపథ్యంలో బాలకృష్ణ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
"నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి 'నర్తనశాల'ను నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతోకాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తి చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై 'నర్తనశాల'కి సంబంధించి 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్.బి.కె థియేటర్‌లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేస్తాం. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఎన్నాళ్ల నుంచో ‘నర్తనశాల’ సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది" అని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.