నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ ఇద్దరూ గతంలో 'ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రంలో కలిసి నటించారు. ఒకే తెరను పంచుకున్న వీరిద్దరు ఈ ఏడాది ఒకే పాత్రలో నటించేందుకు పోటీ పడనున్నారు. అదీ అఘోరా వేషంలో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడు రెండు గెటప్పుల్లో దర్శనమివ్వనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఆ లుక్‌లో బాలయ్య ఎలా ఉంటాడా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి కీలక పాత్రలు పోషించాలంటే కొంచెం సాహసంతో కూడిన వ్యవహారమే. అందుకే ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సరికొత్త పాత్రలు పోషించేందుకు యువ హీరోలూ సిద్ధమవుతున్నారు. వినూత్న కథల్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ముందుండే మనోజ్ ఈ ప్రయత్నం చేస్తున్నాడని గుసగుసలు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాలో ఈ హీరో అఘోరాగా కనిపిస్తాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. బాలయ్య, మనోజ్.. ఇద్దరూ కెరీర్‌లో తొలిసారి అఘోరా పాత్రలు పోషిస్తున్నారు.