నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుత పాత్రల్లో నటించారు. వాటిల్లో 'ఆదిత్య 369' ఒకటి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆణిముత్యంగా నిలిచి.. నేటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది. టైమ్ మిషన్( భూత, భవిష్యత్, వర్తమాన కాలాల) నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను సమ్మిళితం చేసి ఈ చిత్రాన్ని.. దర్శకుడు సంగీతం శ్రీనివాసరావులు తెరకెక్కించారు. ఈ కథాంశానికి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విడుదలై జులై 18తో 29 ఏళ్లు పూర్తయ్యాయి.
ప్రత్యేకతలు
ఈ చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు అద్భుతమైన దర్శకత్వం, జంధ్యాల వినోద, సరస సంభాషణలతో పాటు వైవిధ్యమైన కథ, ఇళయరాజా సంగీతం, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, పిసి శ్రీరామ్, విఎస్‌ఆర్ స్వామి, కబీర్‌లాల్‌ల ఛాయాగ్రహణం వంటివి ఈ సినిమా బలాలు. దీన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శ్రీమతి అనితా కృష్ణ నిర్మించారు.
విజయనగర రాజ్యం కాలంలో కృష్ణమోహన్ అనే (తరువాతి కాలం నుంచి వచ్చిన) యువకునిగానూ, కృష్ణదేవరాయలుగానూ రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని కనబరిచారు బాలయ్య. ఆహార్యంలోనూ తన తండ్రి ఎన్టీఆర్‌ను తలపించారు.