తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా ఎనర్జీ సీక్రెట్ అదే.. అందుకే ఇలా: బాలకృష్ణ - బాలకృష్ణ అల్లు అర్జున్​ మల్టీస్టారర్​ సినిమా

Akhanda success meet: 'అఖండ' చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్​ మీట్​ను నిర్వహించిన చిత్రబృందం.. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్​, కలెక్షన్లు, బాలకృష్ణ-బన్నీ మల్టీస్టారర్​, అన్​స్టాపబుల్​ షో, బాలయ్య ఎనర్జీకి సీక్రెట్​ సహా పలు విషయాల గురించి మాట్లాడారు. ఆ విశేషాలివీ..

balakrishna akhanda movie
బాలకృష్ణ అఖండ సినిమా

By

Published : Jan 12, 2022, 7:39 PM IST

Akhanda success meet: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం 'అఖండ'. గతేడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంక్రాంతి సంబురాలు పేరిట సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన చిత్రబృందం.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ సమాధానాలిచ్చారు. ఆ విశేషాలివీ..

ప్రస్తుతం.. సినిమాలు థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శితమవట్లేదు. అలాంటిది 'అఖండ' 50వ రోజుకి చేరుకుంటుంది. దానికి కారణం?

బోయపాటి శ్రీను: మంచి ప్రయత్నం, కొత్తదనమే ఇందుకు కారణం. తెరపై ఇంతకుముందెన్నడూ చూడని దాన్ని చూపిస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనే దానికి మంచి ఉదాహరణ ఈ సినిమా. ఈ చిత్రాన్ని చాలామంది మూడునాలుగు సార్లు చూశారంటే రీజన్‌ అదే. సామాజిక అంశంతోపాటు దైవత్వాన్ని సరైన రీతిలో చెప్పటంతో అందరినీ ఆకట్టుకుంది.

అన్‌ సీజన్‌లో 'అఖండ'ను తీసుకొచ్చారు. అంత నమ్మకం ఏంటి?

బోయపాటి శ్రీను: కథపైనే నమ్మకం. 'అఖండ'.. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత వచ్చిన పెద్ద సినిమా, కమర్షియల్‌ సినిమా, మాస్‌ సినిమా, దైవాత్మిక సినిమా.. ఇలా అన్ని క్వాలిటీస్‌ ఉన్న సినిమా. మా చిత్రాన్ని మేం నమ్మాం. ఏడారిలో విడుదల చేసినా ఆడుతుందనే ధైర్యం మాది.

Balakrishna Aghora role: అఘోరాల ఆహార్యం దాదాపు శివుడిని పోలి ఉంటుంది కదా! సినిమాలో దర్శకుడు మిమ్మల్ని అలా చూపించలేదెందుకు?

బాలకృష్ణ: ముందు నన్ను నేను గుర్తుపట్టాలి కదా (నవ్వులు). ఇలాంటి ప్రయోగాల విషయంలో స్టార్లు, నటులు అనే కేటగిరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్లతో ఎప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. అప్పటికీ అఘోరా పాత్ర కోసం దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డారు. శివతత్వం అంటే రౌద్రమే కదా. దానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం.

మీరు.. మీ కెరీర్‌ ప్రారంభంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉన్నారు. ఆ రహస్యం ఏంటి?

బాలకృష్ణ: రహస్యమంటూ ఏం లేదండి. ఎప్పుడూ కొత్తగా చేయాలనే తపనే నన్నలా ముందుకు నడిపిస్తుంది. అందుకు తగ్గట్టే అవకాశాలు వచ్చాయి. నాకు నా పనిమీదే తప్ప వేరే వాటిపై ధ్యాస ఉండదు. నేనెన్ని చిత్రాల్లో నటించానో, నా సినిమాలు ఎంత వసూళ్లు సాధించాయో అనే విషయాల్ని నేను పట్టించుకోను. నా నిర్మాతలు బాగుండాలనే ఉద్దేశంతో సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటా. ప్రతిరోజూ నాన్నగారి (నందమూరి తారకరామారావు) సినిమా ఏదోటి చూసే పడుకుంటా. అవే నాకు స్ఫూర్తినిస్తుంటాయి. తెల్లవారుజామునే నిద్రలేచి వ్యాయామం చేస్తుంటా.

మధ్యలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "బాలకృష్ణ దేన్నీ తనలో దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు, మాట్లాడతారు. అందుకే ఆయన అంత ప్రశాంతంగా ఉంటారు. ఆయనకు ఏది అనిపిస్తే అది చేసేస్తాడు, ఆ క్షణంలో ఎలా బతకాలో అలా బతికేస్తాడు. అదే ఆయన ఆరోగ్య రహస్యం" అని తెలిపారు.

Balayya Unstoppable program: 'అఖండ' తోపాటు 'అన్‌స్టాపబుల్‌' షోతోనూ మంచి విజయం అందుకున్నారు. అసలు వ్యాఖ్యాతగా ఎలా ఒప్పుకున్నారు?

బాలకృష్ణ:అదంతా యాదృచ్ఛికంగా జరిగింది. ఓసారి నిర్మాత అల్లు అరవింద్‌ "ఓ కార్యక్రమం రూపొందించాలనుకుంటున్నాం. మీరు హోస్ట్‌గా చేస్తే బాగుంటుంది" అని అన్నారు. కొత్తదనాన్ని కోరుకునే మనిషిని కాబట్టి వెనకాముందూ ఆలోచించకుండా ఓకే చెప్పా. నాన్నగారిలానే నేనూ అడ్వాన్స్‌డ్‌గా (భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని) ముందుకెళ్తుంటా. 'అన్‌స్టాపబుల్‌' ఈ ప్రయత్నంలో భాగమే. అరవింద్‌గారే కాదు ఇదే కాన్సెప్ట్‌తో ఎవరొచ్చినా నేను ఒప్పుకునేవాడ్ని. నటుల జీవితాల్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం అగ్రస్థానంలో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.

మీ మంచితనం 'అన్‌స్టాపబుల్‌' షోతో ప్రేక్షకులందరికీ తెలిసింది. 'బాలయ్యది ఇంత గొప్పమనసా' అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయాలు దృష్టికి వచ్చాయా?

బాలకృష్ణ: నేను మంచివాడిననే అభిప్రాయం ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. కొట్టించుకునేవాడు ప్రేమతో కొట్టించుకుంటే నేనేం చేయను (నవ్వులు). ఈ విషయాలు సోషల్‌ మీడియా వేదికగా నా దృష్టికి వచ్చాయి.

Balakrishna Alluarjun multistarrer: బన్ని (అల్లు అర్జున్‌), బాలయ్య, బోయపాటి (బీబీబీ).. క్రేజీ ప్రాజెక్టును ఆశించొచ్చా?

బోయపాటి శ్రీను: ప్రయత్నిద్దాం. ఏదీ జరగదు అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఏది.. ఎప్పుడు.. ఎలా జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

బాలకృష్ణలాంటి మాస్‌ హీరోతో హైందవ ధర్మం, ప్రకృతి గురించి చెప్పించాలనే ఆలోచన ఎవరిది?

బోయపాటి శ్రీను: మా కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్‌' సోషల్‌ ఎలిమెంట్‌తో విజయం అందుకున్నాయి. మళ్లీ అదే నేపథ్యంతో వస్తే ఏం బాగుంటుందని కొత్త పాయింట్‌ చెప్పాలనుకున్నా. ఆ మార్పే ఈ రోజు 'అఖండ' విజయాన్ని అందించింది.

Akhanda sequel: ఈ చిత్రానికి సీక్వెల్‌/రీమేక్‌ ఏదైనా సిద్ధం చేస్తున్నారా?

బోయపాటి శ్రీను: కచ్చితంగా సీక్వెల్‌ ఉంటుంది. కొనసాగింపు చిత్రానికి కావాల్సిన లీడ్‌ అఖండలో ఉంది. అయితే అది ఎప్పుడనే సంగతి ఇప్పుడు చెప్పలేను. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా.

ఈ సినిమాలోని చాలా సంభాషణలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితుల్ని గుర్తుచేశాయి కదా. దాని గురించి చెప్తారా?

బాలకృష్ణ: అవును నిజమే. ఇలాంటి వాటి గురించి ప్రజాప్రతినిధిగా వేరే వేదికలపై చర్చిస్తూనే ఉంటాం. సినిమా ఓ మాధ్యమం కాబట్టి దీని ద్వారా చెప్పాలనుకున్నాం. ఎందుకంటే ఇతరులు ఎవరైనా దాని గురించి మాట్లాడితే పట్టుంచుకోరు. మనం రాజధానిలేని రాష్ట్రంలో ఉంటున్నాం. దాని కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. ఆ పరిస్థితులకు తగ్గట్టే కొన్ని డైలాగ్స్‌ చెప్పి ప్రజల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశాం.

Akhanda collections: ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టడమే కాదు ఓ థియేటర్లలో మంటలు పుట్టించింది. దానిపై మీ స్పందన?

బాలకృష్ణ: నేనెప్పుడూ విజయానికి పొంగిపోను. అపజయానికి కృంగిపోను. నా ప్రయత్నం నేను చేస్తా. జయాపజయాలు అన్నీ దైవాధీనం.

'అఖండ'.. మీ కెరీర్‌కి ఎలా ఊతమైంది? ఎందుకని ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడటం లేదు?

బోయపాటి శ్రీను: బాలయ్య అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులూ క్యూ కట్టి చూసిన సినిమా ఇది. కొంతమందికే తెలిసిన నేను ఇప్పుడు ఈ చిత్రంతో ప్రతి ఇంటికీ పరిచయమయ్యా. ఆ అభిమానాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటా. ఇదనే (అఖండ) కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో 'పుష్ప' అయినా, 'శ్యామ్‌ సింగరాయ్‌' అయినా, మరొకటైనా సినిమా గెలవటమే ముఖ్యం. కలెక్షన్ల గురించి ఆలోచించామంటే మా అంత అవివేకి ఎవరూ ఉండరు. ఈ రోజు సినిమా గెలిచింది అదే ఆనందం.

ఈ సినిమాను అఘోరాలు కూడా చూశారు. అది విన్నాక మీకెలా అనిపించింది?

బాలకృష్ణ: అఘోరాలంటే మనలో చాలామందికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. వాళ్లూ మనుషులే. ఆ విషయాన్నే ఈ సినిమాలో చూపించాం. అయితే వాళ్లకు వాళ్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అఘోరాలకు సరైన నిర్వచనమిచ్చిన చిత్రమిది. అలాంటి వారే ఈ సినిమాను చూడటం ఆనందాన్నిచ్చింది

విలన్‌గా ప్రేక్షకుల్ని భయపెట్టారు. మీ లుక్‌ చూసి ఊహ అలానే భయపడ్డారా?

శ్రీకాంత్‌: గెటప్‌తోనే ఓ రోజు ఇంటికి వెళ్లా. కుటుంబ సభ్యులంతా నన్ను గుర్తుపట్టలేదు పైగా భయపడ్డారు. ఈ పాత్రను చూసి భయపడి వేరేవాళ్లు అవకాశం ఇవ్వరేమోనని నాకు భయమేస్తోంది (నవ్వులు).

ఇదీ చూడండి: బాలయ్య-బన్నీ​ మల్టీస్టారర్ సినిమా​.. బోయపాటి క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details