గత కొంతకాలంగా అడపాదడపా మల్టీస్టారర్ సినిమాలు తళుక్కున తెలుగు తెరపై మెరుస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర కథానాయకులు, యువ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లేవీ జరగడం లేదు. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. దర్శకులు, కథానాయకులు కొత్త సినిమా కథల ఎంపికలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు కొత్త కథలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'అయ్యప్పానుమ్ కొషియుమ్' అనే మలయాళ చిత్ర రీమేక్ హక్కులు కొనుగోలు చేసింది.
పృథ్వీరాజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నందమూరి బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో పాత్ర కోసం యువ కథానాయకుడు రానాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ విషయమై రానాతో సితార బృందం చర్చలు జరిపిందని టాక్. త్వరలోనే దర్శకుడ్ని ఎంపిక చేయనున్నారట. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.