తెలుగు తెరపైనే కాకుండా పలు భాషల్లో ఘన విజయం సాధించిన 'బాహుబలి' మరోసారి ప్రపంచ ప్రఖ్యాత వేదికపై ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రముఖులతో ఔరా అనిపించిన జక్కన్న చిత్రం... ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లోనూ కనువిందు చేయనుంది.
లండన్‌లోని ఈ ప్రముఖ కాన్సర్ట్ హాల్లో బాహుబలి సినిమా వరల్డ్ ప్రీమియర్ లైవ్‌ను నిర్వహించబోతున్నారు. దీనికి చిత్ర బృందం కూడా హాజరు కాబోతోంది. రాజమౌళి, ఎమ్.ఎమ్. కీరవాణి, ప్రభాస్, రానా, అనుష్క... ప్రముఖులతో కలిసి సినిమా వీక్షించనున్నారు. 'బాహుబలి: ది బిగినింగ్' ప్రీమియర్ అక్టోబరు 19న సాయంత్రం 7 గంటలకు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రేక్షకుల కోసం టికెట్లను కూడా రాయల్ ఆల్బర్ట్ హాల్ తమ వెబ్సైట్లో బుకింగ్‌కు ఉంచింది. ఈ హాల్లో ప్రదర్శించనున్న తొలి దక్షిణాసియా చిత్రం బాహుబలి.