బాలీవుడ్ ర్యాపర్ బాద్షా.. ముంబయి పోలీసుల విచారణలో తప్పు ఒప్పేసుకున్నాడు. తన ఆల్బమ్ సాంగ్ వ్యూస్ పెంచేందుకు డబ్బులు చెల్లించిన మాట వాస్తవమేనని అతడు చెప్పినట్లు డిప్యూటీ కమీషనర్ నందకుమార్ ఠాకుర్ వెల్లడించారు. నకిలీ ఫాలోవర్స్ స్కామ్‌లో భాగంగా 7.2 కోట్ల వీక్షణల కోసం బాద్షా రూ.72 లక్షలు చెల్లించాడని చెప్పారు.
అసలేం జరిగింది?
బాద్షా రూపొందించిన ఆల్బమ్ గీతం 'పాగల్'.. విడుదలైన 24 గంటల్లో 75 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ క్రమంలోనే టేలర్ స్విఫ్ట్, కొరియన్ బ్యాండ్ బీటీఎస్ రికార్డులను అధిగమించింది. అయితే గూగుల్ ఈ వాదనను తిరస్కరించింది. దీంతో నకిలీ ఫాలోవర్ల అంశం తెరపైకి వచ్చింది. ఈ స్కామ్‌తో సంబంధముందనే అనుమానంతో పోలీసులు బాద్షాను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 20 మంది సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు మాట్లాడిన బాద్షా.. తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు. ఆరోపణల్లో నిజం లేదని, అలాంటి ప్రచారం చేస్తున్న వారిని క్షమించనని తెలిపాడు.