ఆయనని తలచుకోగానే మనకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వులు చిందుతాయి. ఎన్ని బాధల్లో ఉన్నా చిటికలో మనసు ఉల్లాసభరితమవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆయన మంచి హాస్యానికి అసలు సిసలైన చిరునామా. ఆయనే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. బ్రహ్మానందంల్లాంటి నటుల సరసన సత్తా చాటుకున్న ప్రముఖ హాస్య నటుడు. అంతేనా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తన ఉనికిని బలంగా నిరూపించుకున్నారు. పూర్వాశ్రమంలో ఆయన పాత్రికేయుడు కూడా. ఇంతకీ.. ఆయన ఎవరో కాదు...ఏవీఎస్. ఏవీఎస్ అనే పొడి అక్షరాల్లోనే ఆయన సుప్రసిద్ధులు. ఏవీఎస్ 2013, నవంబర్ 8న మరణించారు. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఏవీఎస్ గురించి కొన్ని విషయాలు.
కుటుంబ నేపథ్యం, వృత్తి
1957 జనవరి 2న ఏవీఎస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జన్మించారు. రాఘవయ్య, శివ కామేశ్వరి తల్లిదండ్రులు. ఏవీఎస్ డిగ్రీని వీఎస్‌ఆర్ కళాశాలలో పూర్తిచేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడు రంగస్థల నాటకాలను వేసేవారు. రసమయి సంస్థని రూపొందించారు. మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. మంచి జర్నలిస్ట్‌గా పత్రికా రంగంలో పేరు సంపాదించుకున్నారు.
వ్యక్తిగత జీవితం
ఏవీఎస్‌కు 1980లో వివాహమైంది. ఆశాకిరణ్మయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏవీఎస్‌కు ఆశాకిరణ్మయి స్టేజీ కార్యక్రమాలలో పరిచయం అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడి పేరు ప్రదీప్. కుమార్తె పేరు శ్రీ ప్రశాంతి.
బాపు సినిమా ద్వారా సినీ ఎంట్రీ
1993లో విడుదలైన 'మిస్టర్ పెళ్లాం' సినిమాతో ఏవీఎస్ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కామెడీ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రంలోని పాత్రకి ఏవీఎస్‌కి నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో ఏవీఎస్ 'నాకదో తుత్తి' అని అంటూ ఉంటారు. ఈ డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. అసలు ఈ సినిమాతో ఏవీఎస్ సినిమా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'శుభలగ్నం' చిత్రంలో 'గాలి కనుబడుతుందా?' అంటూ అనేకానేక ప్రశ్నలు వేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. 'ఘటోత్కచుడు' సినిమాలో 'రంగు పడుద్ది' అని చెప్పి ప్రేక్షకుల మోములో నవ్వులు పూయించారు. కొన్ని సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
బహుముఖ ప్రజ్ఞ
ఎన్నో టీవీ షోస్‌లో ఏవీఎస్ పాల్గొన్నారు. సినిమాల్లోని పాత్రలతో పాటు వీటికి కూడా ఏవీఎస్‌కు ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు పురస్కారాలు లభించాయి. 'అంకుల్', 'ఓరి నీ ప్రేమ బంగారం కాను' సినిమాలను నిర్మించారు. 'సూపర్ హీరోస్', 'ఓరి నీ ప్రేమ బంగారం కాను', 'రూమ్ మేట్స్', 'కోతిమూక' చిత్రాలకు దర్శకత్వం వహించారు. 19 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 500 చిత్రాల్లో నటించారు ఏవీఎస్. హాస్యనటుడిగా సుమారు 450 సినిమాలల్లో చేశారు. నారదుడిగా, శకునిగా పౌరాణిక సినిమాలలోనూ నటించారు.
మరణం
కాలేయ వ్యాధితో ఏవీఎస్ మృతి చెందారు. మణికొండలో తన కుమారుడు ప్రదీప్ ఇంట్లో ఏవీఎస్ కన్నుమూశారు. 2013, నవంబర్ 8న అభిమానులను శోక సముద్రంలోకి నెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఏవీఎస్.
ఇవీ చూడండి.. బాలీవుడ్ రీమేక్‌లో రానా-విశ్వక్సేన్!